అతడు గ్రౌండ్లో కనిపిస్తే ఫ్యాన్స్‌కు పండగే. బ్యాట్ పట్టుకున్నాడంటే పరుగుల సునామీయే. బౌలింగ్ వేసేది ఎవరైనా గుండెల్లో దడపుట్టాల్సిందే. విసిరిన ప్రతి బాల్ బౌండరీ దాటాల్సిందే అతనే టీమిండియా, పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ (Virat Kohli). ఇక, విరాట్ కోహ్లీ నవంబర్ ఐదు శనివారం తన 34వ యేటలోకి అడుగుపెడుతున్నాడు.
1988 నవంబర్ 5 వతేదీన ఢిల్లీలో జన్మించిన విరాట్ కోహ్లీ అంచెలంచెలుగా ఎదిగి టీమిండియా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ గా ప్లేయర్ గా ఎదిగాడు. చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఎంతో ఆసక్తి ఉన్న కోహ్లీని తన తండ్రి ఎంతో ప్రోత్సహించాడు. ఢిల్లీ అకాడమీలో శిక్షణ పొందిన కోహ్లీ టీం ఇండియా అత్యుత్తమ క్రికెటర్లలలో ముందు వరుసలో ఉంటాడు.
సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్ ఇద్దరూ గాయపడినప్పుడు 2008లో శ్రీలంకతో ఆడిన ఐడియా కప్ ద్వారా మొదటిసారి వన్ డే ఇంటర్ నేషనల్స్‌లో అడుగుపెట్టాడు. తరువాత ఇక కోహ్లీకి వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. తన ప్రతిభ చాటుతూ మహేంద్ర సింగ్ ధోని తరువాత భారత క్రికెట్ జట్టు సారధ్య బాధ్యతలు దక్కించుకున్నాడు. అప్పటి నుంచి టీం ఇండియాకు ఎన్నో విజయాలను అందించాడు.
ఇక, ప్రపంచ క్రికెట్ చరిత్రలో రికార్డుల రారాజు. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ సాధించిన రికార్డులను బద్దలు కొట్టేవారు ఎవరైనా ఉన్నారా అంటే ప్రపంచంలో ఉన్న ఏ క్రికెట్ అభిమాని నోటి నుంచి అయినా వచ్చే ఒకే పేరు విరాట్ కోహ్లి. ఇలాంటి క్రికెటర్ తమ దగ్గర ఉండాలని క్రికెట్ ఆడే ప్రతీ దేశం కలలు కంటుంది.
అంతర్జాతీయ క్రికెట్లో 24 వేలకు పైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, రెండేళ్ల క్రితం దాకా ఏదో సరదాకి సెంచరీలు బాదుతున్నట్టుగా శతకాలు బాదుతూ పోయాడు. అయితే ఒక్కసారిగా కోహ్లీ బ్యాట్ మూగబోయింది. ఎన్నో విమర్శలు వచ్చాయి. గోడకు కొట్టిన బంతిలా మళ్లీ బౌన్స్ బ్యాక్ అయి.. ఇప్పటికీ తానే క్రికెట్ పరుగుల రారాజు అని నిరూపించుకున్నాడు. అందుకు సాక్ష్యం ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్.
ఇక, పాకిస్థాన్ మీద ఆడిన ఒక్క ఇన్నింగ్స్ చాలు కోహ్లీ అంటే ఏంటో చెప్పడానికి. 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో పడ్డ టీమిండియాకు ఒంటిచేత్తో విజయాలు అందించిన అసలు సిసలు వారియర్ కోహ్లీ. హారిస్ రవూఫ్ బౌలింగ్ లో ఆఖర్లో కొట్టిన రెండు సిక్సర్లు ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. నరాలు తెగే టెన్షన్ లో కూడా ఎంతో కూల్ గా టీమిండియాకు విజయం అందించడం వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీకే సాధ్యమవుతుంది.
ఇక, వన్డేల్లో 43, టెస్టుల్లో 27 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, ఆసియా కప్‌లో ఆఫ్ఘాన్‌పై టీ20 సెంచరీ బాది... మొత్తంగా 71 అంతర్జాతీయ శతకాలు బాదాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 8 వేలు, 9000, 10,000, 11 వేల మైలురాయిని అందుకున్న క్రికెటర్ కూడా విరాట్ కోహ్లీయే. 175 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగులు పూర్తిచేసుకున్న కోహ్లీ, 222 ఇన్నింగ్స్‌లో 11 వేల మైలురాయిని అందుకున్నాడు.
ఒక దశాబ్ద కాలంలో 20 వేలకు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు విరాట్ కోహ్లీ. ఈ ఫీట్‌తో ఐసీసీ ‘దశాబ్దపు క్రికెటర్’గా అవార్డు గెలిచాడు... 2016 ఐపీఎల్ సీజన్లో ఏకంగా 973 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఐదు సీజన్లుగా ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది.
2019 వన్డే వరల్డ్‌కప్‌లో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, ఈ ఫీట్ అందుకున్న మొట్టమొదటి కెప్టెన్‌గా నిలిచాడు. అంతేకాదు టీ20 వరల్డ్‌కప్‌లోనూ హాఫ్ సెంచరీ చేసిన మొదటి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీయే. గత ఆరు టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భారత మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదుచేయలేకపోయాడు.
ఇక, విరాట్ కోహ్లీ ఛేజింగ్ లో ఓ వేటాడే పులి. ఛేజింగ్ లో విరాట్ కోహ్లీ దరిదాపుల్లో కూడా ఏ క్రికెటర్ ఉండడు. ఛేజింగ్ సమయంలో క్రీజులో విరాట్ కోహ్లీ ఉన్నాడంటే చాలు.. టీమిండియా గెలిచినట్టే అని ఫ్యాన్స్ భావిస్తారు. ఇలా.. ఓ తరానికి ఆదర్శంగా నిలిచిన కోహ్లీ.. మరెన్నో విజయాలు సాధించాలని కాంక్షిస్తూ న్యూస్ 18 తరఫున హ్యాపీ బర్త్ డే కింగ్ కోహ్లీ.