మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) క్రికెట్ ప్రపంచలోకి పరిచయం అక్కర్లేని పేరు. ఎంతో మంది సీనియర్లకు రాని పేరు, సంపాదని 20 ఏళ్లకే సచిన్ సొంతమయ్యాయి. సచిన్ ఆడుతుంటే కోట్లాది మంది అభిమానులు కళ్లప్పగించి చూస్తుండే వాళ్లు. అతడికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారిలో ఒకరు డాక్టర్ అంజలి. సచిన్ అంటే ఆమెకు విపరీతమైన అభిమానం.
అంజలి, సచిన్ టెండూల్కర్ కలిసి ఓ మూవీకి వెళ్లారు. తనని చూస్తే జనం గుమగూడతారని థియేటర్‌కి లేటుగా వెళ్లాడు సచిన్. అయితే ఇంటర్వెల్లో సచిన్‌ను చుట్టుముట్టేశారు జనం. టెండూల్కర్ ఫాలోయింగ్ చూసి షాక్ అయ్యింది అంజలి. అయితే, సచిన్ తన ప్రేమ కోసం ఎన్నో తంటాలు పడ్డాడు. సచిన్ సతీమణి అంజలి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తనను ఇంటర్వ్యూ పేరుతో ఇంటికి తీసుకెళ్లాడని, ఓ జర్నలిస్టులా తన తల్లితండ్రులకు పరిచయం చేశాడని అతని సతీమణి అంజలి తెలిపింది.
సచిన్ తో బంధం బలపడిన తర్వాత అతనితో మాట్లాడటానికి ఇప్పటి మాదిరిగా ఆ కాలంలో మొబైల్ ఫోన్లు సోషల్ మీడియా లేదు. అందువల్ల సచిన్ తో మాట్లాడటానికి 48 ఎకరాల కళాశాల ప్రాంగణాన్ని దాటి టెలిఫోన్ బూత్‌కు వెళ్లేది అంజలీ. ఎక్కువ సమయం మాట్లాడటంతో బిల్లు కూడా ఎక్కువగా వచ్చేది. టెలిఫోన్ బిల్లులను ఆదా చేయడానికి ప్రేమ లేఖలతో సంభాషించుకునేవాళ్లు.
ఇక, పెద్దలను ఒప్పించి తాము ఎలా పెళ్లి చేసుకున్నామో సచిన్ ఇటీవల ఓ టీవీ షోలో వెల్లడించాడు. "1994లో న్యూజిలాండ్ పర్యటన సమయంలో అది జరిగింది. ఆక్లాండ్, వెల్లింగ్టన్లలో వరుసగా చక్కని ఇన్నింగ్స్‌లు ఆడుతూ మంచి ఫామ్‌లో ఉన్నాను. అప్పుడే అంజలీ నన్ను కలిసి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. నేను సరే అన్నాను.
కానీ రెండు కుటుంబాలతో నువ్వే మాట్లాడి ఒప్పించాలని చెప్పాను. అప్పటికే ఇంట్లో వారికి అంజలీతో పరిచయం ఉన్నా నాకు ఎందుకో పెళ్లి విషయం మాట్లాడాలి అంటే ఇబ్బందిగా అనిపించింది. అందుకే నువ్వు ఇరు కుటుంబాలను ఒప్పిస్తే రేపే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని అంజలీతో అన్నాను. అంజలీనే మా పెళ్లి గురించి అందరినీ ఒప్పించింది" అని సచిన్ చెప్పుకొచ్చాడు.