స్మృతి మంధానకు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆటతో పాటు అందం కూడా ఉన్న మంధానకు యువతలో చాలా ఫాలోయింగ్ ఉంది. ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఇప్పుడు నేషనల్ క్రష్ గా మారింది. బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఆమె ముందు దిగదుడుపే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలాంటి స్మృతి మంధాన నేడు 25 వ పడిలోకి అడుగుపెట్టింది.
11 సంవత్సరాల వయస్సులో మంధనా అండర్ -19 జట్టులో చేరింది. 2013 అక్టోబర్‌లో స్మృతి తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. వెస్ట్ జోన్ అండర్ -19 టోర్నమెంట్లో గుజరాత్‌పై 150 బంతుల్లో 224 పరుగులతో అజేయంగా నిలిచింది. లిస్ట్ ఏ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్ మంధనా రికార్డు నెలకొల్పింది.
అలాగే టీ 20 లో భారత్ తరఫున 24 బంతుల్లో వేగంగా హాఫ్ సెంచరీ చేసి రికార్డు సృష్టించింది. 2019 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో ఈ ఇన్నింగ్స్ ఆడింది. ఇప్పటివరకు 81 టీ 20 మ్యాచ్‌లు ఆడి 1901 పరుగులు చేసింది. ఈ ఫార్మాట్లో స్మృతి 13 సార్లు హాఫ్ సెంచరీలు నమోదు చేసింది. ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్, ఇంగ్లాండ్ కియా సూపర్ లీగుల్లో కూడా ఆడింది.
2016 లో ఆస్ట్రేలియా పర్యటనలో హోబర్ట్‌లో తొలి వన్డే సెంచరీ నమోదు చేసింది. ఇందులో 102 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఆ తర్వాత 2017 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్‌పై రెండో వన్డే సెంచరీ సాధించి 106 పరుగులతో అజేయంగా నిలిచింది. స్మృతి ఇప్పటివరకు 59 వన్డేలు ఆడి 41.74 సగటుతో 2253 పరుగులు చేసింది. ఇందులో నాలుగు సెంచరీలు, 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి.