శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా (Team India) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat kohli) సెంచరీతో కదం తొక్కిన సంగతి తెలిసిందే. 2019 నవంబర్ నుంచి 2022 సెప్టెంబర్ వరకు దాదాపు వెయ్యి రోజులకు పైగా సెంచరీ లేకుండానే గడిపిన కోహ్లీ మళ్లీ శతకాల జాతరను మొదలు పెట్టాడు.
సచిన్ తన కెరీర్ లో 49 వన్డే అంతర్జాతీయ సెంచరీలను చేశాడు. ఇక కోహ్లీ సెంచరీపై అటు అభిమానులతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సచిన్ తో పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మాత్రం కోహ్లీపై సెటైర్స్ వేశాడు. సచిన్ తో కోహ్లీని పోల్చకండి అంటూ అభిమానులకు చురకలు అంటించాడు.
ఇలా.. మన క్రికెటర్లు కోహ్లీని తక్కువ చేస్తుంటే.. పాక్ మాజీ క్రికెటర్లు మాత్రం నెత్తిన పెట్టుకుంటున్నారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. విరాట్ సెంచరీ చేసినప్పుడల్లా ఫ్లాట్ వికెట్‌పై చేశాడని, బలహీనమైన జట్టుపై సెంచరీ సాధించాడనే పనికిమాలిన విమర్శలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన సల్మాన్ బట్.. విమర్శకులకు తనదైన శైలిలో చురకలంటించాడు. " ఆసియాకప్‌లో అఫ్గానిస్థాన్‌పై విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. అఫ్గాన్‌కు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. అయినా కొందరు విరాట్ కోహ్లీ సెంచరీ చేసినప్పుడల్లా బలహీనమైన జట్టు, ఫ్లాట్ వికెట్‌పై సాధించాడని తరుచూ విమర్శిస్తారు. అయితే విరాట్ కోహ్లీ 73 సార్లు సెంచరీ చేశాడనే విషయం తెలియక అలా మాట్లాడుతారో ఏమో నాకు అర్థం కాదు. విరాట్ ఓ క్రికెట్ జీనియస్. " అని సల్మాన్ కౌంటరిచ్చాడు.
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నాడు. ఫామ్ కోసం తంటాలు పడుతున్న సమయంలో అలాంటి ఇన్నింగ్స్ క్రికెటర్ ను మరో స్థాయిలో నిలబెడుతుందంటూ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. సల్మాన్ బట్ వ్యాఖ్యలు గౌతమ్ గంభీర్ కి కౌంటర్ అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.