టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) ప్రారంభం అవడానికి ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే అర్హత సాధించిన అథ్లెట్లు అందరూ సాధనలో మునిగిపోయారు. గత ఏడాదిన్నరగా కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రీడలు స్తంభించిపోయాయి. దీంతో ఆటగాళ్ల మ్యాచ్ ప్రాక్టీసుపై కూడా దెబ్బపడింది. ఈ సారి టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తరపున గోల్డ్ మెడల్ సాధిస్తారని అంచనా ఉన్న ప్లేయర్స్ పై ఓ లుక్కేద్దాం.
టోక్యో ఒలింపిక్స్‌లో తప్పక పతకం సాధిస్తారని భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లపై ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా రియోలో తృటిలో చేజారిన స్వర్ణ పతకాన్ని పీవీ సింధు ఈ సారి తప్పక సాధిస్తుందని అందరూ అనుకుంటున్నారు. గత రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధు, ఈసారి స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ‘డ్రా’లో గ్రూప్ ‘జె’లో ఉన్న సింధు... చెంగ్ గాన్ యి (హాంకాంగ్), సెనియా పొలికరపోవా (ఇజ్రాయెల్)లతో తలపడాల్సి ఉంది. క్వార్టర్స్ వరకు సింధు ఈజీగానే చేరుతుంది. అక్కడ నుంచి కొంచెం కష్టపడితే బంగారు పతకం గ్యారెంటీ.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం సాధించే పోటీదారులలో ప్రముఖంగా వినిపించే పేరు నీరజ్ చోప్రా ఒకరు. జావెలిన్ త్రోయర్ చోప్రా కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌లో బంగారు పతకాన్ని సాధించాడు. గత కొన్నేళ్లుగా ఈ ప్లేయర్ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. అంజు బాబీ జార్జ్ తరువాత ప్రపంచ ఛాంపియన్షిప్ స్థాయిలో అథ్లెటిక్స్‌లో బంగారు పతకం సాధించిన రెండవ భారతీయుడిగా నీరజ్ చోప్రా నిలిచాడు. 2016 సంవత్సరంలో, పోలాండ్‌లో జరిగిన IAAF U20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చోప్రా బంగారు పతకం సాధించాడు. ఈ పతకంతో పాటు జూనియర్ ప్రపంచ రికార్డు కూడా క్రియేట్ చేశాడు.
ఇప్పటి వరకు జరిగిన ఒలింపిక్ క్రీడల్లో షూటింగ్ విభాగంలో భారత్ 4 పతకాలు సాధించింది. షూటింగ్ విభాగంలో భారత్ ఎప్పుడూ ఓ పతకాన్ని ఆశిస్తుంటుంది. ఈ ఏడాది ఒలింపిక్స్‌లో పతకం సాధించే లిస్టులో మొదటి వాడుగా సౌరభ్ చౌదరి పేరుగాంచాడు. ఈ యువ ఆటగాడు ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో వ్యక్తిగత, టీం ఈవెంట్లలో దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇప్పటికే ISSF ప్రపంచ కప్, ప్రపంచ ఛాంపియన్షిప్, యూత్ ఒలింపిక్స్, ఆసియా క్రీడలలో పతకాలు సాధించాడు. క్రొయేషియాలో ఇటీవల ముగిసిన ప్రపంచ కప్‌లో సౌరభ్ ఆట దేశాన్ని ఆకట్టుకుంది.
టోక్యో ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకం గెలిచే భారత క్రీడాకారుల్లో ఒకరిగా భావిస్తున్న వారిలో స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా ముందుంటాడు. ఈ వరల్డ్ నెం.1 రెజ్లర్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే అంతర్జాతీయంగా ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన పునియా సత్తా చాటితే.. భారత్ కు పతకం గ్యారెంటీ. ఇప్పటికే ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన పునియా.. గోల్డ్ మెడల్ కొట్టాలని భావిస్తున్నాడు.
మేరీ కోమ్ ఏడుసార్లు వరల్డ్ చాంపియన్‌షిప్ బంగారు పతకాలు సాధించారు. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్నారు. ఒలింపిక్ పతకం గెలిచిన తొలి, ఏకైక భారతీయ మహిళా బాక్సర్ మేరీనే. ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లోనూ ఆమె పసిడి పతకాలు గెలుపొందారు. ఇలా ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఈ మణిపూసకు తీరని లోటు ఏదైనా ఉందంటే అది ఒలింపిక్స్ గోల్డ్ మెడలే. ఇప్పటికే.. ప్రాక్టీస్ లో దూసుకుపోతున్న మేరీ కోమ్ సత్తా చాటితే..ఆ గోల్డ్ మెడల్ కూడా ఆమె శిఖలో చేరినట్టే.
2016 రియో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి దీపా కర్మాకర్ జిమ్నాస్టిక్స్‌లో పాల్గొని నాల్గవ స్థానంలో నిలిచి తృటిలో మెడల్ కోల్పోయింది. ఇక 2021లో అందరి కళ్లు ప్రణతి నాయక్ పై ఉన్నాయి. దేశం యావత్తు జూలై 25 కోసం టీవీల ముందు కూర్చోనుంది. ఎందుకంటే ఆరోజే ప్రణతి నాయక్ తొలి ఛాలెంజ్‌ను ఎదుర్కోనుంది. ఈ అథ్లెట్ కూడా కచ్చితంగా మెడల్ సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు.