ఐపీఎల్ 2021 (IPL 2021) మలిదశ సందడి అప్పుడే మొదలైంది. ఇంకా 29 రోజుల్లో ఈ మెగా టోర్నికి తెరలేవనుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ లాంటి జట్లు యూఏఈకి చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయ్. మరోవైపు, ఐపీఎల్ ప్రాంచైజీలు తమ అస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్నాయ్. ఇక, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలు వచ్చే నెల మొదటివారం లోపు యూఏఈకి పయనం కానున్నాయి. అయితే ఈ మలిదశ మ్యాచ్‌లకు ముందు అన్ని జట్లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పలువురు స్టార్ ఆటగాళ్లు కొన్ని కారణాల వల్ల ఐపీఎల్ 2021 రెండో దశకు అందుబాటులో ఉండడం లేదు. వారెవరో ఓ లుక్కేద్దాం.
ప్యాట్ కమిన్స్ : ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) ఐపీఎల్ 2021 రెండో దశ నుంచి తప్పుకున్నాడు. కమిన్స్ సతీమణి సెప్టెంబర్ నెలాఖరులో బిడ్డకు జన్మనివ్వనుంది. అందుకే సతీమణిని దగ్గరుండి చూసుకునేందుకు అతడు ఐపీఎల్ ఆడడం లేదు. ఐపీఎల్ 2020 ముందు కోల్‌కతా రూ.15.5 కోట్ల భారీ ధరకు అతన్ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
జోస్ బట్లర్ : ఇక, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు గట్టి షాకే తగిలింది. రాజస్థాన్ స్టార్ ఓపెనర్, ఇంగ్లండ్ ప్లేయర్ జోస్ బట్లర్ యూఏఈ వేదికగా జరిగే సెకండాఫ్ లీగ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ట్విటర్ వేదికగా ప్రకటించింది. జోస్ బట్లర్ భార్య లూయిస్ వెబ్బర్.. త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. అప్పుడు ఆమెకు తోడుగా ఉండాలని బట్లర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని రాజస్థాన్ ఫ్రాంచైజీ తెలిపింది. బట్లర్‌కు రెండేళ్ల కూతురు ఉంది. ఈ సీజన్లో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన బట్లర్ 36.28 సగటుతో 254 రన్స్ చేశాడు. బట్లర్ స్థానంలో తీసుకునే ఆటగాడి వివరాలను రాజస్థాన్ ఇంకా వెల్లడించలేదు.
రిచర్డ్సన్, జంపా: ఆర్సీబీ తరపున ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయర్స్ కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జంపాలు కరోనా భయంతో లీగ్ మధ్యలోనే జట్టును వదిలి స్వదేశానికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తాజాగా యూఏఈ వేదికగా జరిగే లీగ్‌కు కూడా వారు దూరంగా ఉన్నారు. టీ20 ప్రపంచకప్ ఆసీస్ జట్టులో చోటుదక్కించుకున్న ఈ ఇద్దరు మెగా టోర్నీకి సన్నద్ధం కావడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
రిచర్డ్సన్, మెరిడిత్: పంజాబ్ జట్టుకు ఆడుతున్న ఆసీస్ బౌలర్లు జై రిచర్డ్సన్, రిలే మెరిడిత్లు రెండో దశ మ్యాచులకు దూరంగా దూరమయ్యారు. ఈ ఇద్దరూ గాయాలతో సతమతమవుతున్నారు. ఈ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో ఈ ఇద్దరిని పంజాబ్ రూ.14 కోట్లు, రూ. 8 కోట్ల భారీ ధరకు తీసుకుంది. వారి గైర్హాజరీతో టీమ్ బౌలింగ్ ఇప్పుడు బలహీనపడింది. షమీ ఒక్కడే పంజాబ్ జట్టును ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. పంజాబ్ ప్లే ఆఫ్స్ చేరాలంటే రిచర్డ్సన్, మెరిడిత్‌లకు బ్యాకప్ బౌలర్లు ఉండాల్సిందే.