మైదానంలో క్రికెట్ లోనే కాదు.. ఫ్యాషన్ విషయంలో కూడా తమదైన శైలిలో ట్రెండ్ సెట్ చేసే క్రికెటర్లు కూడా బోలెడంత మంది ఉన్నారు. మన టీమిండియా క్రికెటర్లు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పని లేదు. తమ న్యూ హెయిర్ కట్, మీసకట్టులతో అదరగొడుతున్నారు. ఆ స్టైల్ చూసిన వారెవరైనా బాలేదని అంటారా? సూపర్బ్ అనకుండా ఉంటారా? అలా... కిర్రాక్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న మన టీమిండియా ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.
భారత క్రికెట్ జట్టు కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనిది ప్రత్యేక స్థానం. విజయవంతమైన సారథిగా.. బ్యాట్స్‌మెన్‌గా.. వికెట్ కీపర్‌గా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు సంపాదించి పెట్టిన ఒకే ఒక్క కెప్టెన్‌గా ఘనత సాధించిన ధోని ఆటలోనే కాదు.. తన ఆహార్యంలోనూ స్టైలిష్‌గా కనిపిస్తుంటాడు. ముఖ్యంగా హెయిర్ స్టైల్ ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండేలా ధోనీ చూసుకుంటాడు. ఆయన క్రికెట్ కెరీర్లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో స్టైల్స్‌లో కనిపించాడు. ఒక్కో స్టైల్ అదిరిపోయేలా ఉండడంతో యువత ధోనీ స్టైల్ అంటూ హెయిర్ సెలూన్లకు పరిగెత్తుతుంటారు.