మిథాలీ రాజ్ తర్వాత మరో భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సంచలన నిర్ణయం తీసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ రుమేలీ ధర్ (Rumeli Dhar) 38 ఏళ్ల వయసులో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా తన నిర్ణయాన్ని అభిమానులకు తెలిపింది రుమేలీ. 2003లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో ధర్ అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. 2005 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించింది. అయితే, ఆ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. (Rumeli Dhar Instagram)
రుమేలీ ధర్ తన రిటైర్మెంట్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్‌ను పంచుకుంది. "పశ్చిమ బెంగాల్‌లోని శ్యామ్నగర్లో ప్రారంభమైన నా 23 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ ప్రయాణం ఎట్టకేలకు ముగిసింది. నేను అన్ని రకాల క్రికెట్ల నుండి రిటైర్ అవుతున్నాను. ఈ ప్రయాణంలో చాలా ఎత్తు పల్లాలు చూశాను. భారత క్రికెట్ జట్టుకు ఆడుతూ 2005లో ఫైనల్‌కు చేరుకోవడం నాకు మరపురాని విషయం. ఈ ప్రయాణంలో నా కెరీర్ కూడా చాలాసార్లు గాయం కారణంగా పట్టాలు తప్పింది. కానీ, ప్రతిసారీ బలంగా తిరిగి వచ్చాను. సహకరించిన బీసీసీఐ, స్నేహితులు, తోటి ఆటగాళ్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను." అని పేర్కొంది రుమేలీ. (Rumeli Dhar Instagram)
రుమేలీ ధర్ తన 19 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో భారత్ తరఫున 4 టెస్టులు, 78 వన్డేలు, 18 టీ20లు ఆడింది. టెస్టుల్లో 8, వన్డేల్లో 63, టీ20ల్లో 13 వికెట్లు పడగొట్టింది. ధార్ బౌలింగ్ చేయడమే కాకుండా మంచి బ్యాటర్ కూడా. వన్డేల్లో 6, టెస్టు-టీ20ల్లో ఒక్కో అర్ధ సెంచరీ చేసింది. 2009లో ఇంగ్లండ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆమె నిలిచింది. 4 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీసింది. (Rumeli Dhar Instagram)
భారత మాజీ కెప్టెన్ ధర్ 6 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2018లో భారత క్రికెట్ జట్టులోకి తిరిగి వచ్చింది. అప్పుడు ఆమె వయస్సు 34 సంవత్సరాలు. జులన్ గోస్వామి గాయం కారణంగా ఆమె దక్షిణాఫ్రికాతో T20 సిరీస్ కోసం జట్టులో చోటు సంపాదించింది. అయితే, ఆమె జట్టులోకి ఎంపికైనప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ, ధర్ తన ఆటతో అందరి నోళ్లు మూయించింది. ఆ సిరీస్ లో 2 మ్యాచ్‌ల్లో 3 వికెట్లు తీసింది. 2018లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన ట్రై నేషన్ టీ20 సిరీస్‌లో.. ధర్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. (Rumeli Dhar Instagram)