ఇప్పుడు ఆ లిస్ట్ లో టీమిండియా మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజనీర్ చేరారు. రాబిన్సన్ ఎనిమిదేళ్ల కిందట చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించాడు. అతని విషయంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ) నిర్ణయం సరైందేనని, మున్ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై జీవితకాల నిషేదం విధించాలని ఈసీబీని కోరాడు.
ఈ సందర్భంగా రాబిన్సన్ను వెనకేసుకొచ్చిన వారిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఇక యుక్త వయసులో చేసిన ట్వీట్లంటూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. రాబిన్సన్కు మద్దతివ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు తరాలూ ఇలాగే చేస్తాయని పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధాని మాటలు యుక్త వయసు కాబట్టి ఎలాంటి తప్పులైనా చేయొచ్చన్న ధీమా ఇస్తున్నాయని ఫరూఖ్ విమర్శించారు.
ఒలీ రాబిన్సన్ గత బుధవారం న్యూజిలాండ్‌తో ప్రారంభం అయిన తొలి టెస్ట్ ద్వారా ఇంగ్లండ్ జట్టులోకి అరంగేట్రం చేశాడు. మ్యాచ్ తొలి రోజే ఎనమిది ఏళ్ల క్రితం (2013) అతడు చేసిన వివాదాస్పద ట్వీట్లు (స్త్రీ వివక్ష, జాత్యంహకార) బయటపడ్డాయి. సోషల్ మీడియాలో ఆ ట్వీట్లు చక్కర్లు కొట్టాయి. దీంతో రాబిన్సన్ క్షమాపణలు చెప్పాడు.
తాను 18 ఏళ్ల కుర్రాడిగా ఉన్నప్పుడు అలా చేశానని, అప్పుడు తన బుర్ర సరిగా పనిచేయలేదని చెప్పాడు. నేను అలాంటి చెడ్డవాడిని కాదని, తన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని రాబిన్సన్ పేర్కొన్నాడు. ఈ క్షమాపణలపై సంతృప్తి చెందని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కివీస్‌తో తొలి టెస్టు పూర్తి అయిన వెంటనే అతడిని సస్పెండ్ చేసింది.
ఈసీబీ నిర్ణయాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రశ్నించారు. ఒలీ రాబిన్సన్ను వెనకేసుకొచ్చినట్లు మాట్లాడారు. ప్రధాని అతడికి మద్దతివ్వడాన్ని ఫరూఖ్ ఇంజినీర్ తప్పుపట్టారు. "ఈసీబీ మంచి పనే చేసింది. జాతి వివక్ష వ్యాఖ్యలను ఉపేక్షించకూడదు. ఒలీ రాబిన్సన్ను జీవితాంతం నిషేధించాలని నేననడం లేదు. కానీ ఏదో రకంగా కఠిన శిక్ష అనుభవించాల్సిందే. వారి డబ్బుకు కోతపడేలా భారీ జరిమానా విధించడమో.. ఒక టెస్టు సిరీసు లేదా కొంత కాలం ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడకుండా సస్పెండ్ చేయాలి" అని ఫరూఖ్ అన్నారు.
మరోవైపు ఇంగ్లండ్ గడ్డపై తనకు ఎదురైన అనుభవాలు గురించి ఫరూక్ తెలిపారు. "నేను తొలిసారి కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లినప్పుడు.. 'అతడు భారత్ నుంచి వచ్చాడా?' అని మాట్లాడుకునే వారు. ఎన్నో గుసగుసలు వినిపించేవి. లాంకాషైర్‌లో చేరినప్పుడు ఒకట్రెండు సార్లు జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నా. అయితే అవి వ్యక్తిగతమైనవి మాత్రం కావు. కానీ కేవలం భారత్ నుంచి వచ్చినందుకే అలా అన్నారు. నా యాసను ఎగతాళి చేశారు. నిజానికి నా ఇంగ్లిష్ చాలామంది ఇంగ్లండ్ ఆటగాళ్ల కన్నా మెరుగ్గా ఉంటుంది. తొందరలోనే వారు అది తెలుసుకున్నారు. నేను ఎప్పుడూ ముఖం మీదే బదులిచ్చేవాడిని. కీపింగ్‌లోనూ అదరగొట్టాను. దాంతో ఫరూక్‌తో పెట్టుకోవద్దని అనుకునేవారు" అని ఫరూఖ్ ఇంజినీర్ తెలిపారు.
"ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్ తరచూ 'బ్లడీ ఇండియన్స్' అంటుంటేవాడు. మిగతా ప్లేయర్స్ పైకి అనకపోయినా.. అలాంటి ఆలోచనలతో ఉండేవారు. బాయ్‌కాట్ ఒకడే కాదు ఆస్ట్రేలియన్లు సహా మరి కొంతమంది ఆలా అన్నవారిలో ఉన్నారు. కొన్నేళ్ల క్రితం వరకు వారు అలానే అన్నారు. ఎప్పుడైతే ఐపీఎల్ మొదలైందో.. డబ్బు కోసమే మన బూట్లు నాకుతున్నారు. కానీ నాకు మొదట్లో వారి అసలు రంగేంటో తెలుసు. ఇప్పుడు మారారు. కొన్ని నెలలు గడిపేందుకు, డబ్బు ఆర్జించేందుకు ఇప్పుడు భారత్ వారికి గొప్ప దేశంగా మారింది'"అని టీమిండియా మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చారు.