టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతను ఏ మాత్రం భారత జట్టుకు పనికిరాడని, వీలైనంత త్వరగా మరో బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌ను రెడీ చేసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. శ్రీలంక పర్యటనలోని మూడు వన్డేల సిరీస్‌లో హార్దిక్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ దారుణంగా విఫలమయ్యాడు. ఫ్యాన్స్ తో పాటు మాజీ క్రికెటర్లు కూడా హార్ధిక్ పాండ్యాను టార్గెట్ చేశారు.
హార్దిక్ పాండ్యా..బంతితో, బ్యాట్‌తో చెలరేగిపోయే సత్తా ఉన్న మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్. భారీ షాట్లను ఆడటంలో దిట్ట. చూడ్డానికి బలహీనంగా కనిపించినప్పటికీ.. బలమైన షాట్లను బాదగలడు. మెరుపు వేగంతో బంతిని ఫెన్సింగ్ దాటించగలడు. ఆశ్చర్య పరిచేలా ఉంటుంది అతని స్ట్రైక్ రేట్. సగటున 130 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించనూ గలడు. అలాంటి ఆల్‌రౌండర్ ఇఫ్పుడు విమర్శల జడివానలో తడిచి ముద్దవుతున్నాడు. అలాంటి ఆల్ రౌండర్ ఇప్పుడు జట్టుకు భారంగా మారాడు.
లెజెండరీ బ్యాట్స్‌మెన్, టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ సైతం హార్దిక్ పాండ్యాను లక్ష్యంగా చేసుకున్నారు. హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయాన్ని వెదుక్కోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. వీలైనంత త్వరగా పాండ్యాకు రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దీనికోసం ఆయన ఇద్దరి పేర్లను సైతం సూచించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న దీపక చాహర్ నిలకడగా రాణిస్తున్నాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో ఓటమి అంచుల్లో ఉన్న టీమిండియాను అర్ధసెంచరీతో గట్టెక్కించాడు దీపక్ చాహర్.లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగిన అతను పక్కా ప్రొఫెషనల్‌గా ఆడాడు. 82 బంతుల్లో 69 పరుగులు చేశాడు. నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో ఒక సిక్సర్, ఏడు ఫోర్లు ఉన్నాయి.
సునీల్ గావస్కర్ తో పాటు వీరేంద్ర సెహ్వాగ్ కూడా హార్ధిక్ పాండ్యాపై విమర్శలు గుప్పించాడు. హార్దిక్ పాండ్యా బదులు మిగతా క్రికెటర్లకు రాబోయే వరల్డ్ కప్ లో చోటు కల్పించాలని సెలక్టరకు సూచించాడు వీరేంద్రుడు. అతని ఆట తీసికట్టుగా ఉందని.. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో విఫలమయ్యాడని గుర్తు చేశాడు.