కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా మహమ్మారి మహత్యం వల్ల ఎన్ని రంగాలు అతలాకుతలమవుతున్నాయ్. ముఖ్యంగా క్రీడారంగం కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడింది. ఇక, టీమిండియా ఆటగాళ్లు వచ్చే నెల 2 న ఇంగ్లండ్ ను బయలుదేరనున్నారు.టీమిండియా పురుషుల మరియు మహిళల క్రికెట్ జట్టు సభ్యులు కలిసి త్వరలోనే ప్రత్యేక చార్టర్డ్ విమానంలో ప్రయాణించనున్నారు.
"మే 19న ముంబైలో సమావేశం కావాలని బీసీసీఐ అధికారులు సూచించారు. కఠిన క్వారంటైన్ తర్వాత జూన్‌లో ఇంగ్లండ్‌కు వెళుతున్నాం" అని మహిళల క్రికెట్ టీమ్‌కు చెందిన ఓ క్రీడాకారిణి పేర్కొంది. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికయిన భారత ఆటగాళ్లు 14 రోజులు ఇంట్లోనే క్వారంటైన్లో ఉంటారు. ఆ సమయంలో ఆర్టీ-పీసీఆర్ టెస్టులను ఆటగాళ్ల ఇంటివద్దే బీసీసీఐ నిర్వహిస్తుంది. క్రికెటర్లతో పాటు ఇంగ్లండ్ టూర్‌కి వెళ్లాలనుకున్న ఆటగాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా క్వారంటైన్లో ఉండి టెస్టులు చేయించుకోవాలి. కోచింగ్, సహాయ సిబ్బందికి కూడా ఇవే రూల్స్ ఉంటాయి. ఇంగ్లండ్ చేరుకున్నాక ఇరుజట్లు వారం రోజుల ఐసోలేషన్ తర్వాత ప్రాక్టీస్ ప్రారంభిస్తారు.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లనుంది. ఇందుకోసం 24 మందితో కూడిన జట్టును బీసీసీఐ ఇప్పటికే ఎంపిక చేసింది. టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా జూన్ 18-22 మధ్య సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్య 5 టెస్టుల సిరీస్‌లో కోహ్లీసేన పాల్గొంటుంది.
ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఒక టెస్ట్, మూడు వన్డేలు మూడు టీ20లు ఆడనుంది. జూన్ 16-19 వరకు బ్రిస్టల్‌లో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. జూన్ 27న బ్రిస్టల్ మొదటి వన్డేకు ఆతిథ్యం ఇవ్వనుండగా.. రెండవ వన్డే (డే-నైట్) జూన్ 30న టౌంటన్‌లో జరుగుతుంది. ఇక చివరిదైన మూడవ వన్డే జూన్ 3న జరుగుతుంది. మొదటి టీ20 మ్యాచ్ జూలై 9న నార్తాంట్స్‌లో, రెండో టీ20 జూలై 11 హోవ్‌లో, మూడో టీ20 జూలై 15న చెల్మ్స్ ఫోర్డ్లో జరగనున్నాయ్.