అది 2014 ఆస్ట్రేలియా పర్యటన. మూడు టెస్టుల్లో మూడు సెంచరీలు సహా దాదాపు 500 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. తొలి టెస్టులో కెప్టెన్ ధోనీ అందుబాటులో లేకుంటే తాత్కాలిక సారథ్య బాధ్యతలు అందుకుని, జట్టును సమర్థంగా నడిపించాడు. బ్యాటర్ గా కోహ్లీ జోరు, కెప్టెన్గా అతడి పనితనం చూశాక ధోనీ తన నిష్క్రమణకు సమయం ఆసన్నమైందనుకున్నాడు.
నాయకత్వ బాధ్యతలందుకున్నాక బ్యాటర్ గా మరింత మెరుగుపడటం వల్ల.. జట్టును ముందుండి నడిపించే కెప్టెన్గా అతడికి పేరొచ్చింది. జట్టు కూడా నిలకడగా విజయాలు సాధించడం వల్ల అతడికి ఏ రకంగానూ ఎదురు లేకపోయింది. అనిల్ కుంబ్లే లాంటి దిగ్గజం కోచ్ అయ్యాక కోహ్లీతో విభేదాలొస్తే అతను తప్పుకోవాల్సి వచ్చింది కానీ.. కోహ్లీకి ఏ రకమైన ఇబ్బందీ రాలేదు.
పరిస్థితిని అర్థం చేసుకుని టీ20 ప్రపంచకప్ అనంతరం ఈ ఫార్మాట్లో సారథ్యం నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించాడు. 2023 ప్రపంచకప్ వరకు వన్డేల్లో సారథిగా కొనసాగాలని అతను ఆశించి ఉండొచ్చు. అయితే పొట్టి కప్పును సాధించి టీ20 సారథ్యానికి వీడ్కోలు పలికితే వన్డే కెప్టెన్సీకి వెంటనే ముప్పు రాకపోయేదేమో. కానీ ఆ టోర్నీలో టీమిండియా ఘోరంగా విఫలమైంది.
దీనికి తోడు పరిమిత ఓవర్ల క్రికెట్లో రెండు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లను పెట్టే సంప్రదాయం భారత క్రికెట్లో ఎప్పుడూ లేదు. వన్డేలు, టీ20ల్లో దాదాపు ఒకే జట్లు బరిలోకి దిగుతుంటాయి. అలాంటపుడు ఫార్మాట్కో కెప్టెన్ ఉండటం ఏ రకంగా చూసినా ఆమోదయోగ్యంగా అనిపించదు. అందుకే సెలక్టర్లు ఇప్పుడు కోహ్లీపై వేటు వేయక తప్పలేదు.