ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నా.. అప్పుడే టోర్నీ గురించి చర్చ మొదలైంది. ఈసారి ఏ జట్టు గెలుస్తుందో అని క్రికెట్ నిపుణులు, మాజీలు అంచనాలు వేస్తున్నారు. అక్టోబర్ 23న అసలు టోర్నీ అంటే సూపర్ 12 స్టేజ్ ప్రారంభమవుతుంది. అబుదాబిలో జరగబోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. మెగా టోర్నీ కోసం కొన్ని దేశాలు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి.
టీ20 ప్రపంచకప్ 2021ను భారత్ కంటే వెస్టిండీస్ జట్టే గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ జోస్యం చెప్పాడు. పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న విండీస్ పొట్టి కప్‌ను గెలుస్తుందన్నాడు. ఈసారి టీ20 ప్రపంచకప్ విజేత ఎవరనుకుంటున్నారు అని గ్రేమ్ స్వాన్‌ను ప్రెజెంటర్ డానిష్ సైట్ అడగ్గా.. " ఈ టోర్నమెంట్ ప్రణాళిక ప్రకారం భారతదేశంలో జరిగితే.. కోహ్లీసేననే ఫేవరేట్. కానీ ఇప్పుడు వేదిక మారింది. యూఏఈలో పొట్టి కప్ జరుగుతుంది కాబట్టి.. కచ్చితంగా వెస్టిండీస్ విజేతగా నిలుస్తుంది. విండీస్ నా ఫేవరేట్. విండీస్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో ఓ పవర్ ఉంది " అని అన్నాడు.
ప్రస్తుతం విండీస్ జట్టులో ఉన్నవారు అందరూ టీ20 ఆటగాళ్లే. విండీస్ బోర్డు ఇచ్చే వేతనాలు తక్కువ కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు లీగుల్లో ఆడాడనికి కరేబియన్ ప్లేయర్స్ ఆసక్తిచూపిస్తారు. అంతర్జాతీయ జట్టుకు కాకుండా కేవలం ప్రైవేట్ లీగుల్లో ఆడుతున్న ప్లేయర్స్ కూడా వారికి అందుబాటులో ఉన్నారు. అందుకే టీ20 ఫార్మాట్లో విండీస్ పటిష్టంగా ఉంటుంది.
క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, ఆండ్రీ రస్సెల్, జాసన్ హోల్డర్, నికోలస్ పూరన్ మరియు కిరోన్ పోలార్డ్ వంటి స్టార్ ఆటగాళ్లు ప్రస్తుతం జట్టులో ఉన్నారు. ఇందులో పూరన్ మినహా మిగతావారందరూ గత రెండు ప్రపంచకప్‌లు గెలిచిన జట్టులోని సభ్యులే. 2012, 2016 ప్రపంచకప్‌లను విండీస్ గెలుచుకుంది. ఇప్పుడు మూడో టోర్నీపై కన్నేసింది.
టీ20 ప్రపంచకప్‌లోని గ్రూప్-1లో వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఉండగా.. గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి. క్వాలిఫికేషన్ రౌండ్ గ్రూప్-ఎలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, ఒమన్, న్యూగినియా, పాపువా జట్లు ఉన్నాయి.
ఇక, అక్టోబర్ 24 న పాకిస్థాన్ పోరుతో మెగా టోర్నీని ఆరంభించనున్న భారత్.. తన తర్వాతి మ్యాచ్‌లో అక్టోబరు 31న అబుదాబి వేదికగా న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది. ఆ తర్వాత నవంబరు 3న అఫ్గానిస్థాన్‌తో ఆడుతుంది. భారత్ తన మిగతా రెండు సూపర్-12 మ్యాచ్‌లను క్వాలిఫయింగ్ గ్రూప్-బి విజేత (నవంబరు 5)తో, గ్రూప్-ఎ రన్నరప్ (నవంబరు 8)తో ఆడుతుంది.