కరోనా..కరోనా.. ప్రపంచంలో ఎక్కడ విన్నా..ఈ మహమ్మారి విధ్వంసం గురించే అందరూ చెప్పుకుంటున్నారు. దీని ప్రభావంతో ప్రపంచదేశాలన్నీ షేక్ అవుతున్నాయ్. కరోనా ఎఫెక్ట్ చాలా రంగాలపై పడింది. క్రీడా రంగంపై కూడా కరోనా ప్రభావం తీవ్రంగానే ఉంది. ఇప్పటికే ఐపీఎల్ లాంటి మెగా టోర్నీ కరోనా దెబ్బకి నిరవధికంగా వాయిదా పడింది. ఇప్పుడు కరోనా ఖాతాలో మరో మెగా టోర్నీ చేరింది.
ఈ ఏడాది శ్రీలంక వేదికగా జూన్ లో జరగాల్సిన ఆసియా కప్ రద్దైంది. శ్రీలకం కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయ్. దీంతో టోర్నీని రద్దు చేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. " కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ ఆసియా కప్ నిర్వహించలేం. అందుకే ఈ టోర్నీని రద్దు చేస్తున్నాం " అని డిసిల్వా ప్రకటించారు.
వాస్తవానికి గతేడాది పాకిస్థాన్లో జరగాల్సిన ఈ ఆసియా కప్ వేదికను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు శ్రీలంకకు తరలించింది. ఇటీవలి కాలంలో భారత్-పాక్ మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్ల టీమిండియా ఆటగాళ్లు పాక్లో పర్యటించడానికి కేంద్ర ప్రభుత్వం విముఖుత వ్యక్తం చేసింది. భారత జట్టు పాల్గొనడానికి సిద్ధంగా లేని క్రమంలో హక్కులను వదిలేసుకోవడానికి ఇష్టంలేని పీసీబీ.. వేదికను శ్రీలంకకు మార్చింది.
ఆసియా కప్ రద్దు విషయంపై జై షా నేతృత్వంలోని ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఆసియా కప్లో పాల్గొనాల్సిన అన్ని జట్లు తమ క్రికెట్ క్యాలెండర్ను రెండేళ్లకు నిర్ణయించాయి. దీంతో 2023 ప్రపంచకప్ తర్వాత మాత్రమే ఆసియా కప్టోర్నీని నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. చివరిసారిగా 2018లో జరిగిన ఆసియా కప్.. మళ్లీ ఎప్పుడు జరుగుతుందో చూడాలి.