అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) లేటెస్ట్ గా టీ20 ప్రపంచకప్ 2021 (T-20 World Cup 2021) పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ యూఏఈ, ఒమన్ వేదికగా మెగా టోర్నీ జరగనుంది. ఈసారి భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లను హాట్ ఫేవరెట్ జట్లగా నిపుణులు పరిగణిస్తున్నారు.
ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నా.. అప్పుడే టోర్నీ గురించి చర్చ మొదలైంది. ఈసారి ఏ జట్టు గెలుస్తుందో అని క్రికెట్ నిపుణులు, మాజీలు అంచనాలు వేస్తున్నారు. అక్టోబర్ 23న అసలు టోర్నీ అంటే సూపర్ 12 స్టేజ్ ప్రారంభమవుతుంది. అబుదాబిలో జరగబోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. మెగా టోర్నీ కోసం కొన్ని దేశాలు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి.
ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌లో తీవ్ర ప్రభావం చూపే ముగ్గురు ఆటగాళ్ల పేర్లను టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, కామెంటేటర్ దినేష్ కార్తీక్ చెప్పాడు. వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్, టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలు సత్తాచాటగలరని జోస్యం చెప్పాడు. ఈ ముగురు టోర్నీలో అద్భుతాలు చేయగలరని, మిగిలిన జట్లకు పెద్ద తలనొప్పిగా మారగలని అంచనా వేశాడు.
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తీవ్ర ప్రభావం చూపుతాడని దినేష్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. " పాండ్యాకు 2019లో శస్త్రచికిత్స జరిగింది. అతడు జట్టులోకి తిరిగివచ్చినప్పటి నుంచి బ్యాటింగ్‌లో నిరంతరం కష్టపడుతున్నాడు. గత కొన్ని నెలలుగా భారత్, ముంబై ఇండియన్స్ జట్లకు బౌలింగ్ చెయ్యట్లేదు. శ్రీలంకతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో రెండు వన్డేల్లో 19, 0 పరుగులు చేశాడు. అయినా పాండ్యా ఎప్పుడూ సవాలు విసిరే ఆటగాడే. ఛాలెంజ్ లకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే కీలక ఆటగాళ్లలో అతడు ఒకడు అని నమ్ముతా. పాండ్యా టీ20 ప్రపంచకప్‌లో కీలక ఆటగాడిగా మారబోతున్నాడు" అని డీకే అన్నాడు.
వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ గురించి వ్యాఖ్యాత దినేష్ కార్తీక్ మాట్లాడుతూ... " నికోలస్ పూరన్ నాకు ప్రత్యేకమైన ఆటగాడు. అతను తన కెరీర్‌ను ముగించినప్పుడు టీ20 ఫార్మాట్లో గొప్ప ఆటగాడు అవుతాడు. ఎందుకంటే అతని బ్యాటింగ్ అద్భుతమైనది. ఎవరూ ఆడలేని బంతులను కూడా నికోలస్ సులభంగా ఆడగలడు. ఇప్పటివరకు కొట్టిన దూరం కంటే.. అతడు క్రికెట్ బంతిని మరింత బాదగలడు. ఒకవేళ వెస్టిండీస్ టోర్నమెంట్ గెలవాలంటే పూరన్ చెలరేగాల్సిందే. విండీస్ జట్టుకు పూరన్ చాలా ముఖ్యమైన ఆటగాడిగా మారుతాడు" అని పేర్కొన్నాడు.
ఇక ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ గురించి మాట్లాడుతూ... "మిచెల్ స్టార్క్ ఫామ్ అందుకుంటే ఆస్ట్రేలియాకు పెద్ద ఊరట లభించినట్టవుతుంది. డెత్ ఓవర్లలో అతను చాలా కీలకం. ఇటీవల కాలంలో అతని పనితీరు బాగోలేదు. కానీ వెస్టిండీస్‌తో ఆడిన చివరి సిరీస్‌లో ప్రత్యేకించి వన్డేల్లో అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అందుకే మెగా టోర్నీలో అతడు కీలకం కానున్నాడు" అని చెప్పుకొచ్చాడు.
అక్టోబర్ 24 న పాకిస్థాన్ పోరుతో మెగా టోర్నీని ఆరంభించనున్న భారత్.. తన తర్వాతి మ్యాచ్‌లో అక్టోబరు 31న అబుదాబి వేదికగా న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది. ఆ తర్వాత నవంబరు 3న అఫ్గానిస్థాన్‌తో ఆడుతుంది. భారత్ తన మిగతా రెండు సూపర్-12 మ్యాచ్‌లను క్వాలిఫయింగ్ గ్రూప్-బి విజేత (నవంబరు 5)తో, గ్రూప్-ఎ రన్నరప్ (నవంబరు 8)తో ఆడుతుంది.