టీ20 వరల్డ్ కప్ 2022 (T20 World Cup 2022) రసవత్తరంగా సాగుతుంది. సెమీస్ లెక్కలు మొదలయ్యాయి. సెమీస్ రేసులో నిలవడం కోసం ప్రతి జట్టు హోరీహోరీగా తలపడుతున్నాయి. ఇక, సౌతాఫ్రికాపై ఓటమి తర్వాత టీమిండియా (Team India) కూడా సెమీస్ కు వెళ్లాలంటే కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.టీమిండియా తమ నెక్ట్స్ రెండు మ్యాచుల్లో బంగ్లాదేశ్, జింబాబ్వేతో తలపడనుంది. పేపర్ మీద.. ఈ రెండు జట్ల కన్నా టీమిండియా స్ట్రాంగ్ గానే ఉంది.
అయితే, ఈ మెగాటోర్నీ తర్వాత భారత్ న్యూజిలాండ్ (New Zealand) లో పర్యటిస్తుంది.ఈ పర్యటనకు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరికీ విశ్రాంతి ఇచ్చారు. కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ టెస్ట్, వన్డే సిరీస్ ఆడనుంది టీమిండియా. అయితే, న్యూజిలాండ్ పర్యటనలో టీ20 జట్టులో భారీ మార్పులు జరిగాయి.
టీమిండియా సీనియర్ ప్లేయర్లు దినేష్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్‌లు పక్కన పెట్టింది. టీ20 లాంటి ఫాస్ట్‌ఫుడ్ ఫార్మాట్లో యువ రక్తంతో పాటు కొంత అనుభవం కూడా అవసరమే కోణంలో ఈ ఇద్దరికి టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కింది. అయితే, ఈ వరల్డ్ కప్ తర్వాత ఈ ఇద్దరూ టీ20 ఫార్మాట్ కి ఎంపికవ్వడం కష్టమే అన్న అభిప్రాయం ఉంది.
ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టులో అదరగొట్టి.. ఫినిషర్ రోల్ లో దినేష్ కార్తీక్ జాతీయ జట్టులోకి వచ్చాడు. 2007లో జరిగిన తొలి వరల్డ్ కప్ నుంచి టీమిండియాలో ఉన్న డీకే.. ధోని హవా కొనసాగినంత కాలం వెనుకబడిపోయాడు. కానీ.. తిరిగి జట్టులోకి రావాలనే తన సంకల్పానికి అదృష్టం కూడా తోడు నిలిచిందనే చెప్పాలి. ఒకానొక దశలో క్రికెట్ గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమైన డీకే.. ఐపీఎల్ 2022లో దుమ్ములేపాడు.
మరోవైపు.. కెప్టెన్ రోహిత్ శర్మ పట్టుబట్టి అశ్విన్‌ను వరల్డ్ కప్ జట్టులోకి తీసుకున్నాడు. నిజానికి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ టీ20 వరల్డ్ కప్ ప్రణాళికల్లో అశ్విన్ లేడు. అయితే, అశ్విన్ కూడా ఆశించిన స్థాయలో రాణించలేకపోతున్నాడు. దీంతో అశ్విన్, డీకే టీ20 కెరీర్లకు ఈ వరల్డ్ కప్ తర్వాత పుల్‌స్టాప్ పడనున్నట్లు సమాచారం.