గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన డూ ఆర్ డై పోరులో ఐర్లాండ్ (Ireland) 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్ పై ఘనవిజయం సాధించింది. ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (48 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించాడు. 147 పరుగులతో బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ 17.3 ఓవర్లలో వికెట్ మాత్రమే నష్టపోయి 150 పరుగులు చేసి నెగ్గింది.
లోర్కాన్ టక్కర్ (35 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ ఆండ్రీ బల్ బిర్నీ (23 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తమ వంతు పాత్ర పోషించారు. టి20 ప్రపంచకప్ లో సూపర్ 12కు చేరుకోవడం ఐర్లాండ్ కు ఇదే తొలిసారి. అయితే, ఈ మ్యాచుకు ముందు అందరూ విండీస్ జట్టునే హాట్ ఫేవరేట్ అనుకున్నారు. అయితే, వారి అంచనాలు తలకిందులై బోక్కబోర్లాపడ్డారు.
గేల్ మాట్లాడుతూ.. " ఈ ప్రపంచకప్ ఫైనల్ ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య జరుగుతుందని నేను భావిస్తున్నా. అయితే విండీస్ జట్టుకు ఫైనల్ చేరడం అంత ఈజీ కాదు. కీరన్ పొలార్డ్, ఆండ్రూ రసెల్, డ్వేన్ బ్రావో వంటి ఆటగాళ్లు లేకుండా వెస్టిండీస్ ఈ ప్రపంచకప్ లో బరిలోకి దిగుతున్నది. కానీ ప్రస్తుత విండీస్ జట్టులో చాలా మంది ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఉన్నారు.
అయితే, ఇప్పుడు గేల్ చెప్పిన అంచనాలన్నీ తలకిందులయ్యాయి. దీంతో ఫ్యాన్స్ తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అంటూ సెటైర్లు వర్షం కురిపిస్తున్నారు. టీ20లలో ఏ జట్టు గొప్ప అనే విషయం తేల్చడానికి ఉండదు. క్షణాల్లో మ్యాచ్ గమనం మారిపోతుంది. ఓడుతుందనుకున్న జట్టు గెలుస్తుంది. గెలుస్తుందనుకున్న జట్టు దారుణంగా ఓడుతుంది. విండీస్ విషయంలో కూడా ఇదే జరిగింది.