టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) ఇటీవలే 40వ ఏటలోకి అడుగుపెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ధోనీ.. ఐపీఎల్లో మాత్రం కొనసాగుతున్నాడు. సారథిగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. గతేడాది ఆగష్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ధోనీ క్రికెట్ కు వీడ్కోలు పలికాక ఫ్యాన్స్ చాలా నిరుత్సాహపడ్డారు. టీ -20 ప్రపంచకప్ ఆడి రిటైర్ ఇచ్చి ఉంటే బాగుండేదని చాలా మంది అనుకున్నారు. ఐపీఎల్ లో అయినా ధోనీ ఆటను ఆస్వాదించవచ్చని అభిమానులు సంబరపడ్డారు. అయితే, ధోనీకి ఈ ఐపీఎల్ సీజన్ చివరిది అన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయ్. దీంతో ఫ్యాన్స్ మరోసారి నిరాశలో పడ్డారు.
"ఎంఎస్ ధోనీ మరో ఒకటి లేదా రెండు సంవత్సరాలు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొనసాగవచ్చు. మహీ పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. కఠిన సాధన చేస్తున్నాడు. ధోనీ ఆట కొనసాగించలేడని అనుకోవడానికి ఎటువంటి కారణం కనబడడం లేదు. మరో రెండేళ్లపాటు ఆడగలడు. చెన్నై కోసం అతడు ఏం చేశాడో తెలుసు. అందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. మహీ అనుభవజ్ఞుడైన ఆటగాడు, మంచి కెప్టెన్. అంతేకాదు గొప్ప ఫినిషర్ కూడా. మంచి వ్యక్తి. ఈ బాధ్యతలను అన్నింటిని చక్కగా నిర్వర్తిస్తున్నాడు" అని విశ్వనాథన్ అన్నారు.
ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే గతేడాది మినహా ఆడిన ప్రతీ సీజన్లోనూ ప్లే ఆఫ్స్‌కు చేరింది. 2008 అరంగేట్ర సీజన్ నుంచి 2019 సీజన్ వరకు చెన్నై జైత్రయాత్ర అప్రతహితంగా సాగింది. అయితే ఫిక్సింగ్ ఆరోపణలతో 2016, 2017లో బ్యాన్‌కు గురైంది. ఈ రెండు సీజన్లు మినహా 2019 వరకు ఆడిన ప్రతీ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఇందులో 2010, 2011, 2018 టైటిల్స్ గెలిచిన ధోనీ సేన.. 2008, 2012, 2013, 2015, 2019 ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది.