భారత దేశానికి అనేక మంది మల్లయోధులను, ఇతర క్రీడాకారులను అందించిన రాష్ట్రం హర్యానాలో పూజా రాణి బోహ్రా జన్మించింది. 1991 ఫిబ్రవరి 17న భివానీ జిల్లాలోని నిమ్రివాలీ గ్రామంలో పూజా రాణి జన్మించింది. ఆమె జన్మించిన చుట్టు పక్కల గ్రామాల్లో ఎక్కువగా రెజ్లర్స్ ఉండేవాళ్లు. ఆడ, మగ తేడా లేకుండా రెజ్లింగ్ నేర్చుకోవడానికే ఇష్టపడే వాళ్లు. పూజా చాలా ఎత్తుగా ఉండటంతో ఆమె కళాశాలలోని ప్రొఫెసర్ భార్య బాక్సింగ్ వైపు నడిపించింది. మొదట్లో బాక్సింగ్ గ్లౌవ్ వేసుకోవడానికి కూడా ఇష్టపడని పూజ తర్వాత ఆటపై అమితమైన ప్రేమ పెంచుకున్నది. (PC: Instagram)
ఎలాగైనా బాక్సర్ కావాలని భావించిన పూజ.. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా హవా సింగ్ బాక్సింగ్ అకాడమీలో చేరిపోయింది. శిక్షణ సమయంలో తగిలిన దెబ్బలు బయటకు కనపడకుండా మేనేజ్ చేసేది. పెద్ద గాయాలు అయితే తన స్నేహితుల ఇంటిలోనే ఉండి.. మాని పోయిన తర్వాత ఇంటికి వెళ్లేది. ఎందుకు అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నానని బుకాయించేది. అలా ఆరు నెలల క్లిష్టమైన శిక్షణ తీసుకున్నది. (PC: Instagram)
హవాసింగ్ బాక్సింగ్ అకాడమీలో శిక్షణ అనంతరం జాతీయ స్థాయిలో జూనియర్ చాంపియన్‌గా నిలిచింది. ఆ అవార్డును తీసుకెళ్లి నేరుగా వాళ్ల నాన్న చేతిలో పెట్టింది పూజ. తాను ఇన్నాళ్లు ఎంత కష్టపడ్డానో పూజ తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో మొదట్లో వ్యతిరేకించిన వాళ్లే తర్వాత పూజను ప్రోత్సహించారు. ఆట వద్దన్న వాళ్లే దగ్గరుండి శిక్షణ కేంద్రం వద్దకు తీసుకెళ్లి విడిచిపెట్టేలా చేసుకున్నది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పూజా మరింత ఉత్సాహంతో బాక్సింగ్‌లో దూసుకొని వెళ్లింది. (PC: Instagram)