టెస్ట్ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మక టోర్నీలలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఒకటి. భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ సిరీస్ చాలా చిరస్మరణీయ క్షణాలను అందించింది. ఫిబ్రవరి 9 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమవుతుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవడానికి ఇండియా ఆస్ట్రేలియాను ఓడించాల్సిన అవసరం ఉంది. 2020-21 ఎడిషన్‌లో ఆస్ట్రేలియాపై 2-1తో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది.
గత మూడు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలను ఇండియానే గెలుచుకుంది. ఈ ట్రోఫీలో కూడా ఇండియా కాస్తంత బలంగానే కనిపిస్తోంది. కానీ ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేసే అవకాశం కూడా లేదు. ఆస్ట్రేలియన్లు ఈ ఏడాది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం సన్నాహాలను ప్రారంభించారు. భారతదేశంలోని పరిస్థితులను ప్రతిబింబించే పిచ్‌లపై ప్రాక్టీస్ చేస్తున్నారు. త్వరలో మొదలుకానున్న ఈ టోర్నీలో కీలకంగా కనిపిస్తున్న ఐదుగురు ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
* నాథన్ లియోన్ : ఆస్ట్రేలియన్ స్పిన్నర్ నాథన్ లియాన్ ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయర్స్‌లో ఒకడు. షేన్ వార్న్ అనంతర కాలంలో ఆస్ట్రేలియాకు దక్కిన అస్త్రంగా చెప్పవచ్చు. లియోన్ తన ప్రదర్శనతో మ్యాచ్‌ను మలుపుతిప్పగలడు. ఇప్పటికే ఆస్ట్రేలియా తరఫున 115 టెస్టు మ్యాచ్‌ల్లో 460 వికెట్లు పడగొట్టాడు. అతను ఖచ్చితంగా 500 వికెట్ల మైలురాయిపై కన్నేసినట్లు కనిపిస్తోంది.
2021 జనవరి నుంచి అతను 17 మ్యాచ్‌లలో 31.78 సగటుతో 66 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. కానీ అతని స్ట్రైక్ రేట్ 74.7 కావడం అత్యంత ఆందోళన కలిగించే అంశం. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో లియోన్‌పై ఆస్ట్రేలియా చాలా ఆధారపడి ఉంది. లియాన్ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో లేకపోయినా, రాబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదు.
* విరాట్ కోహ్లి : కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడిన కోహ్లి, తిరిగి పుంజుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల కోహ్లి వరుస సెంచరీలు సాధించాడు. ప్రత్యర్థులపై దూకుడు ప్రదర్శిస్తున్నాడు. అభిమానులను అలరించే ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. కానీ ఇదంతా వైట్ బాల్ క్రికెట్లో జరుగుతోంది. కోహ్లి రెడ్-బాల్ ఫామ్ ఇప్పటికీ ఆందోళనకు గురిచేస్తోంది. విరాట్ గతేడాది ఆరు టెస్టు మ్యాచ్‌ల్లో 26.50 కంటే తక్కువ సగటుతో 265 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల బంగ్లాదేశ్ సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో 45 పరుగులు మాత్రమే చేశాడు.
కానీ కోహ్లి లయ అందుకుంటే ఆపడం కష్టం. 2014 ఇంగ్లండ్ సిరీస్‌ను పరిశీలిస్తే 5 మ్యాచ్‌ల్లో 134 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కానీ అతని పునరాగమనం అద్భుతం. అడిలైడ్‌లో రెండు సెంచరీలు బాదాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2014లో విరాట్ మొత్తం 692 పరుగులు చేశాడు. ఇది ఇప్పటికీ ఆస్ట్రేలియాలో ఇండియన్ ప్లేయర్ చేసిన అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఆస్ట్రేలియాపై విరాట్ ఇప్పటివరకు 1682 పరుగులు చేశాడు. అందులో 7 సెంచరీలు ఉన్నాయి. కోహ్లి మళ్లీ మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నారు. ఇండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు వరుసగా రెండోసారి చేరుకోవడానికి కోహ్లి కీలకం.
* స్టీవ్ స్మిత్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ప్రధాన ఆటగాడు స్టీవ్ స్మిత్ రెడ్-హాట్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో 231 పరుగులు చేశాడు. స్మిత్‌కు భారత్‌పై మంచి బ్యాటింగ్ రికార్డు ఉంది. 72.58 సగటుతో పరుగులు చేశాడు. 2017 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో పూణేలో 109 పరుగులతో అతని అద్భుతమైన ఇన్నింగ్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ర్యాంక్-టర్నర్ పిచ్‌లో భారత స్పిన్నర్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. రాబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో స్టీవ్ స్మిత్‌ను అధిగమించడం భారత బౌలర్లకు అంత సులభం కాదు. స్మిత్ చెలరేగితే ఇండియాకు కష్టాలు తప్పవు.
* రవీంద్ర జడేజా : భారత మేనేజ్మెంట్కు ఉపశమనం కలిగించే విధంగా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా క్రికెట్లోకి సంచలనాత్మక పునరాగమనం చేశాడు. 2022 ఆసియా కప్‌లో జడేజా మోకాలి గాయంతో క్రికెట్‌కు దూరమయ్యాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌కు ముందు అతని పునరాగమనం ఆస్ట్రేలియాకు హెచ్చరికే అవుతుంది. ఇటీవల తమిళనాడుతో సౌరాష్ట్ర తరఫున రంజీ మ్యాచ్ ఆడిన జడేజా మూడో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు.
* ఛతేశ్వర్ పుజారా : ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ప్రత్యేకంగా వ్యూహాలను సిద్ధం చేసే ఆటగాళ్లలో ఛతేశ్వర్ పుజారా ఒకడు. పుజారా తన టెస్ట్ కెరీర్ ప్రారంభం నుంచి ఆస్ట్రేలియాపై మెరుగ్గా రాణించాడు. 2018 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పుజారా గరిష్ట స్థాయికి చేరుకున్నాడు. పర్యటనలో 1,258 బంతులను ఎదుర్కొని 521 పరుగులు చేశాడు. 2020-21 ఎడిషన్‌లో 274 పరుగులు చేశాడు.
ముఖ్యంగా అతను గోడలా నిలబడి 928 బంతులను ఎదుర్కొన్నాడు. ప్రత్యర్థిపై ఒత్తిడిని పెంచాడు. కనీసం మూడు ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన ఆటగాళ్లలో, మూడు 50+ స్కోర్లను నమోదు చేసిన పుజారా అత్యుత్తమ బాల్స్-పర్-డిస్సల్ (116) నిష్పత్తిని కలిగి ఉన్నాడు. పుజారా అద్భుతమైన ఫామ్‌లో బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ సిరీస్‌లో 226 పరుగులు చేసిన విషయం తెలిసిందే.