ఆమ్రపాలి హౌజింగ్ ప్రాజెక్ట్‌లోని కస్టమర్ డేటాలో ఇంతదాకా బకాయిలు చెల్లించని ఓనర్లలో మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఉన్నాడు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రస్తుతం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఎన్బీసీసీ.. ఈ మేరకు ధోనీతో పాటు మొత్తం పద్దెనిమిది వందల మందికి నోటీసులు జారీ చేసింది. గడువులోగా బకాయిలు చెల్లించి.. ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని కోరింది.
ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ గ్రూప్‌నకు 2009 నుంచి 2016 వరకు ధోనీ ప్రచారకర్తగా వ్యవహరించాడు. ప్రాజెక్ట్ నిర్వాహణ ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన సుప్రీం కోర్టు.. ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతల్ని ప్రభుత్వ పర్యవేక్షణలో పని చేసే సంస్థ ఎన్బీసీసీకి అప్పగించింది. ఇప్పటికే చాలామంది పేమెంట్స్ పూర్తి చేయగా.. బకాయిలు చెల్లించని వాళ్లలో ధోనీ కూడా ఉన్నారు. ప్రాజెక్టులో భాగంగా రెండు ఫ్లాట్లు ధోనీ పేరిట ఉన్నాయి.
నొయిడాలోని సాప్పైర్ ఫేజ్-1లోని పెంట్ హౌజ్ కోసం కోటిన్నరకుగానూ ఇదివరకే ఇరవై లక్షలు ధోనీ చెల్లించినట్లు ఎన్బీసీసీ గుర్తించింది. అంతేకాదు అంబాసిడర్‌గా వ్యవహరించినందుకు తక్కువ ఎమౌంట్‌కే ప్లాట్లను అప్పగించినట్లు, ధోనీతో పాటు పలువురు క్రికెటర్లకు 37 కోట్ల రూపాయల్ని చెల్లించినట్లు రోహిత్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ వెల్లడించింది. ఇక ఈ హౌజింగ్ సొసైటీలో హోం బయర్స్ దాదాపు పదివేలమంది కస్టమర్ డాటాలో పేర్లను నమోదు చేసుకోకపోవడం విశేషం.
ఇక, లేటెస్ట్ గా మహేంద్రసింగ్ ధోనీ.. టీ-20 ప్రపంచకప్ కోసం టీమిండియాకు మెంటర్ గా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ విషయంలోనూ ధోనీకి పరస్పర విరుద్ద ప్రయోజనాల సెగ తగిలింది. ఐపీఎల్ లో ఓ టీమ్ కు కెప్టెన్ గా ఉంటూ.. టీమిండియా మెంటర్ గా నియామకం చెల్లదంటూ మధ్యప్రదేశ్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ సంజీవ్ బీసీసీఐకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.