కోహ్లీసేన ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ లో పర్యటిస్తోంది. ఆగస్ట్ 4 నుంచి ఈ మెగా సిరీస్ ప్రారంభం కానుంది. అయితే, ఈ సిరీస్ కోసం కోహ్లీసేన చేసిన విజ్ఞప్తిని చేతన్ శర్మ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ తిరస్కరించినట్లు సమాచారం. ఇంతకీ టీమిండియా అడిగిన రిక్వెస్ట్ ఏంటి..? సెలెక్షన్ కమిటీ ఎందుకు ఆ రిక్వెస్ట్ ని పక్కనపెట్టింది..?
ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఎడమ పిక్క కండరాల గాయంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. గాయం కారణంగా అతడు స్వదేశానికి వచ్చేశాడు. దీంతో అతడి స్థానంలో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ కోసం యువ ఓపెనర్లు పృథ్వీ షా, దేవ్‌దత్ పడిక్కల్‌లను పంపాలని సెలక్టర్లని కోహ్లీసేన రిక్వెస్ట్ చేసింది.
ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన ఓ బీసీసీఐ అధికారి.. షా, పడిక్కల్‌ను ఇంగ్లండ్‌కు పంపించట్లేదని స్పష్టం చేశారు. వారిద్దరూ శ్రీలంకలోనే మ్యాచులు ఆడతారని తెలిపారు. " పృథ్వీ షా శ్రీలంకలోనే ఉండి ఆరు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడతాడు.అతడిని ఆ సిరీస్ కోసమే ఎంపిక చేశాం. అతడు తన కమిట్మెంట్ను పూర్తి చేస్తాడు. శ్రీలంక పర్యటన ముగిసిన తర్వాత ఏమైనా అవకాశాలు ఉంటే పరిశీలిస్తాం. ప్రస్తుతమైతే ఏ ఆలోచన లేదు. పడిక్కల్ విషయంలోనూ అంతే" అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.
బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్‌ను స్టాండ్‌బైగా ఇంగ్లండ్ పర్యటనకు పంపించడం కూడా హాట్ టాపిక్ గా మారింది. 2019-20 రంజీ సీజన్, ఇండియా ఏ న్యూజిలాండ్ పర్యటనలో ఏ మాత్రం ప్రభావం చూపని అభిమన్యు ఈశ్వరన్‌ను ఏ ప్రాతిపాదికన ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేశారనే ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై మాట్లాడిన సదరు బీసీసీఐ అధికారి.. ఈశ్వరన్ అనుకున్న స్థాయిలో రాణిస్తాడనే నమ్మకం లేక ఇద్దరు ఓపెనర్లను కోరినట్లు తెలిపారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ కోసం అక్కడే ఉన్న టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్ సిరీస్ మధ్యలో ఆరు వారాల సమయం ఉండడంతో బీసీసీఐ కోహ్లీసేనకు 20 రోజుల పాటు విశ్రాంతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత ఆటగాళ్లు లండన్, చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వేచ్ఛగా విహరిస్తున్నారు.