టీమిండియాలో (Team India) ఇప్పుడు అన్నీ భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) ముగిసిన తర్వాత టీమిండియాలో సమూల మార్పులకు బీసీసీఐ (BCCI) తెరతీసింది. టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను (Rahul Dravid) నియమించారు. ఇక వైట్ బాల్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను (Rohit Sharma) ఎంపిక చేశారు. టెస్టు క్రికెట్‌కు మాత్రం విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఇలాంటి సమయంలో భారత జట్టు భవిష్యత్ ఎలా ఉండబోతుందనేది ప్రతీ క్రికెట్ ఫ్యాన్‌కు ఆసక్తికరంగా మారింది.
ముఖ్యంగా, ఆటగాడిగా ఆకట్టుకుంటూ.. ప్రత్యర్థుల కవ్వింపులకు దీటుగా బదులిస్తూ.. కెప్టెన్‌గా నిలకడైన విజయాలు సాధిస్తూ.. ఇన్నాళ్లూ జట్టులో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన కోహ్లీ అనూహ్య పరిస్థితుల నడుమ ఇప్పుడు వన్డే కెప్టెన్సీ వదులుకోవాల్సి వచ్చింది. ఇది ఒకరకంగా అతడికి ఇబ్బందికరమే. దీంతో, అతడి ఫ్యాన్స్ నెట్టింట వేదికగా రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా సౌరవ్ గంగూలీని బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో కూడా కోహ్లీతో మాట్లాడి చూశానని.. అలాగే వ్యక్తిగతంగా కూడా ఉన్న సమస్యలను కూడా చర్చించానని గంగూలీ చెప్పుకొచ్చాడు. అయితే అంతిమంగా కోహ్లీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడానికి నిరాకరించినట్లు చెప్పాడు. అయితే, ఇండియాకు కోహ్లీ చేసిన సేవలకు గంగూలీ ధన్యవాదాలు తెలిపాడు. కెప్టెన్‌గా కోహ్లీ చాలా సాధించాడని గంగూలీ అన్నాడు. ఇకపై కూడా ఆటగాడిగా జట్టుతో కోహ్లీ ఉండటం లాభించే విషయం అని అన్నాడు.
వైట్ బాల్ క్రికెట్లో ఇద్దరు కెప్టెన్లు ఉండటం చాలా గందరగోళానికి దారి తీస్తుందని సెలెక్టర్లు భావించినట్లు గంగూలీ చెప్పాడు. యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ జరగడానికి ముందే విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పేశాడు. ఆ సమయంలోనే సెలెక్టర్లు, బీసీసీఐ పెద్దలు విరాట్ కోహ్లీని నచ్చచెప్పడానికి ప్రయత్నించినట్లు గంగూలీ వెల్లడించాడు.
టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని.. జట్టులో గందరగోళం ఏర్పడుతుందని బీసీసీఐ అతడికి వివరించినట్లు చెప్పాడు. అతడిని ఎంత బతిమిలాడినా అసలు ఒప్పుకోలేదని.. దీంతో సెలెక్టర్లు తమ నిర్ణయం తాము తీసుకున్నారని గంగూలీ అన్నాడు. వైట్ బాల్ క్రికెట్‌కు ఇద్దరు కెప్టెన్ల పద్దతి ఎక్కడా లేదని గంగూలీ చెప్పాడు. సెలెక్టర్లు కూడా కోహ్లీని రెడ్ బాల్ క్రికెట్‌కు పరిమితం చేయడానికి ఇదే కారణమని గంగూలీ వివరించాడు.