ఇక, లేటెస్ట్ గా విరాట్ కోహ్లీ వర్సెస్ గంగూలీ (Virat Kohli Vs Sourav Ganguly) వార్ గురించి అందరికీ తెలిసిందే. కోహ్లీ వ్యాఖ్యలతో గంగూలీపై విరాట్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తప్పించి, రోహిత్‌శర్మకు ఆ బాధ్యత అప్పగించినప్పటి నుంచి బీసీసీఐపై, సెలెక్టర్లపై కోహ్లీ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు.
దీనికి గంగూలీ బదులిస్తూ తనకు విరాట్ కోహ్లీ యాటిట్యూడ్ అంటే బాగా ఇష్టమని చెప్పాడు. అయితే కోహ్లీ బాగా కోట్లాడుతాడని సరదాగా అన్నాడు. కోహ్లీకి కోపం ఎక్కువ అని, అతను చాలా పోరాటపటిమను చూపిస్తాడని ఈ సందర్భంగా గంగూలీ వ్యాఖ్యానించాడు. కోహ్లీతో ఇటీవల నెలకొన్న వివాదం గురించి గంగూలీ నేరుగా చెప్పకపోయినా, ఆయన హావభావాల్లో మాత్రం ఆ విషయం కనిపించింది.
ఇదే కార్యక్రమంలో తన వ్యక్తిగత జీవితం గూరించి ప్రశ్నించగా గంగూలీ తనదైన స్టైలులో సమాధానమిచ్చాడు. అసలు ప్రశ్నమిటంటే జీవితంలో మీరు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు? అని, దీనికి గంగూలీ అసలు జీవితంలో ఒత్తిడి అనేది ఉండదని, కానీ భార్య, గర్ల్‌ఫ్రెండ్ వంటివాళ్లు ఒత్తిడిలోకి నెడుతారని సరదాగా వ్యాఖ్యానించాడు. దీంతో ఆ కార్యక్రమం అంతా కాసేపు నవ్వులతో నిండిపోయింది.
అయితే, ఇటీవల తనను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంతో బీసీసీఐపై కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వన్డే కెప్టెన్సీ తొలగించడానికి ముందు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పాడు. అలాగే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకునే సమయంలో కూడా తనను వద్దంటూ వారించారని బీసీసీఐ చెబుతున్నది అబద్దమని, అసలు ఎవరు అలా అనలేదని చెప్పుకొచ్చాడు. అయితే దీనిపై బీసీసీఐ మరోలా స్పందించింది.
కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకునే సమయంలోనే వద్దని చెప్పామని, కోహ్లీ వినలేదని చెప్పుకొచ్చింది. వన్డే కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు కూడా కోహ్లీకి రెండు రోజుల ముందే చెప్పామని చెప్పింది. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇద్దరు కెప్టెన్లు ఉంటే సమతుల్యం దెబ్బతింటుందనే కోహ్లీని తప్పించామని సెలెక్టర్లు వివరణ ఇచ్చారు.