సౌతాఫ్రికా పర్యటన (India Tour Of South Africa)లో టీమిండియా (Team India) ఓటమి పాలైన తర్వాత కోహ్లీ (Virat Kohli) టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్న సంగతి తెలిసిందే. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగిన భారత్ తొలి టెస్టు మ్యాచ్ గెలిచి మంచి ఊపులో కనిపించింది. కానీ అనూహ్యంగా ఆ తర్వాతి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయి ఏకంగా సిరీస్‌నే కోల్పోయింది. బౌలర్లు స్థాయికి తగ్గట్టు రాణించినప్పటికీ బ్యాటర్లు రాణించకపోవడమే టీమిండియా కొంప ముంచింది.
దీంతో, టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దాంతో భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ప్రస్థానం ముగిసింది. యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌తోనే టీ20 కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై చెప్పగా.. ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదని వన్డే సారథ్య బాధ్యతల నుంచి బీసీసీఐ తప్పించింది.
అయితే వన్డే, టీ20 సారథ్యాన్ని కోల్పోయినా.. తనకు నచ్చిన సుదీర్ఘ ఫార్మాట్లో కెప్టెన్‌గా కోహ్లీ కొనసాగుతాడని అంతా భావించారు. కానీ ఏమైందో ఏమో కానీ కోహ్లీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. 100వ టెస్ట్ మైలురాయికి అడుగు దూరంలో ఉన్న కోహ్లీ.. కెప్టెన్‌గానే ఆ ఘనతను అందుకుంటాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.
బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. కోహ్లి సంచలన ప్రకటనకు కొద్ది గంటల ముందు బీసీసీఐ నుంచి కోహ్లికి ఓ ఆఫర్ వచ్చిందట. తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచే 100వ టెస్ట్ మ్యాచ్‌కు సారధిగా వ్యవహరించిన తర్వాత కెప్టెన్సీ నుంచి వైదొలిగే అంశాన్ని పరిశీలించాల్సిందిగా బీసీసీఐ ప్రతినిధి కోహ్లిని కోరాడట.
కోహ్లీ.. 68 మ్యాచుల్లో టీమిండియాను నడిపించగా 40 సార్లు గెలిపించాడు. కేవలం 17 మ్యాచుల్లోనే ఓటమి పాలయ్యాడు. మరో 11 మ్యాచులు డ్రా అయ్యాయ్. అతని విజయ శాతం 58.82. విరాట్ కోహ్లీ కన్నా ముందు స్టీవ్ వా (71.92 శాతం), రికీ పాంటింగ్ ( 62.33 శాతం) మాత్రమే ముందున్నారు. అలాగే, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో విదేశాల్లో టీమిండియా 16 టెస్ట్ మ్యాచుల్లో నెగ్గింది.