విరాట్ కోహ్లీ (Virat kohli) పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఒకప్పుడు కోహ్లీ మైదానంలో దిగాడంటే పరుగుల వరద పారేది. సెంచరీ చేసే దాకా అవుటయ్యేవాడు కాదు. అయితే గత రెండేళ్లుగా కోహ్లీకి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఎప్పుడో 2019 నవంబర్‌లో సెంచరీ బాదిన అతడు మళ్లీ సెంచరీ చేసి ఎరుగడు. అడపాదడపా అర్ధ సెంచరీలు సాధించినా... అవి అభిమానులను సంతోష పెట్టలేకపోతున్నాయి.
ఇక, గత కొద్ది నెలలుగా.. కోహ్లీకి, బీసీసీఐ (BCCI) పెద్దలకు మధ్య అస్సలు పడటం లేదు. కోహ్లీ టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకోగానే వన్డే సారథ్యాన్ని కూడా బీసీసీఐ అతడి నుంచి లాక్కుంది. ఎందుకు అంటే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వేర్వేరు కెప్టెన్లు ఉంటే మంచిది కాదని అందుకే కోహ్లీ నుంచి వన్డే నాయకత్వ బాధ్యతలను లాగేసుకున్నామని బీసీసీఐ బాస్ గంగూలీ (ganguly) కూల్‌గా సమాధానమిచ్చాడు.
సొంతగడ్డపై శ్రీలంక పర్యటనకు సంబంధించి మార్పులు చేసిన షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. ముందుగా ప్రకటించిన విధంగా ఇరు జట్ల మధ్య తొలుత టెస్ట్ సిరీస్ కాకుండా.. టీ20 సిరీస్ జరగనుంది. తాజా షెడ్యూల్ ప్రకారం.. భారత్, శ్రీలంక జట్ల మధ్య ఫిబ్రవరి 24 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత మార్చి 4 నుంచి టెస్ట్ సిరీస్ ఆరంభం అవుతుంది.
అయితే, బీసీసీఐ చేసిన పని అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. షెడ్యూల్ మార్పు విషయంలో శ్రీలంక క్రికెట్ బోర్డు అభ్యర్ధనను మన్నించి, ముందుగా టీ20 సిరీస్‌కు అనుమితిచ్చిన బీసీసీఐ, కోహ్లీకి చిరకాలం గుర్తుండిపోయే టెస్ట్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా యధాతథంగా కొనసాగించడాన్ని అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కావాలనే బీసీసీఐ ఏదో మనసులో పెట్టుకుని కోహ్లీ కక్ష సాధిస్తోందని ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.