బీసీసీఐ తాజాగా విడుదల చేసిన వార్షిక కాంట్రాక్ట్‌లో సీనియర్లకు మొండిచేయి ఎదురైంది. అంతకుముందు సి కేటగిరీలోనైనా చోటు దక్కింది. ఇప్పుడు అది కూడా దూరమైంది. గత కొన్నేళ్లుగా టెస్టు జట్టులో మాత్రమే కొనసాగుతున్న ఇషాంత్ శర్మను ఈసారి కాంట్రాక్ట్‌కు దూరంగా ఉంచారు. గాయం కారణంగా టీ20 జట్టులో మాత్రమే చోటు దక్కించుకున్న మరో బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా దూరమయ్యాడు.-AFP
గాయం నుంచి కోలుకున్న తర్వాత భువనేశ్వర్ కుమార్ టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన జట్టులో కూడా భువీ ఉన్నాడు. నవంబర్ 2022 ఈ పర్యటన తర్వాత నుంచి భువనేశ్వర్ కుమార్ ఏ మ్యాచ్ ఆడలేదు.
మరోవైపు ఇషాంత్ శర్మ కెరీర్ కూడా గాయం కారణంగా ఆఖరి దశలో ఉంది. చాలా కాలంగా ఫిట్నెస్ సమస్యలతో పోరాడుతున్న ఈ స్టార్ బౌలర్ చివరిసారిగా నవంబర్ 2021లో స్వదేశంలో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జట్టులో చోటు దక్కించుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఏకంగా బీసీసీఐ కాంట్రాక్ట్ లో చోటు కూడా దక్కించుకోలేకపోయాడు. గతంలో ఇషాంత్ బీ కేటగిరిలో చోటు దక్కించుకున్నాడు.
ఇషాంత్ శర్మ భారత్ తరఫున 105 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అతను 311 వికెట్లు తీసుకున్నాడు. 80 వన్డేలు ఆడిన ఇషాంత్ మొత్తం 115 వికెట్లు పడగొట్టాడు. కాగా, 14 టీ20ల్లో అతని పేరిట కేవలం 8 వికెట్లు మాత్రమే ఉన్నాయి. బీసీసీఐ తాజా నిర్ణయంతో.. ఇషాంత్ కెరీర్ క్లోజ్ అయినట్టే అని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.