ఇటీవలే ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియంగా పేరు పొందిన మొతేరా నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియం లో భారత్, ఇంగ్లండ్ ల మధ్య జరిగిన టెస్టు ఎన్నో రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. సిరీస్ ని కూడా మన జట్టే గెలుచుకుంది. అయితే ఈ డే నైట్ టెస్ట్ మ్యాచ్ లో రికార్డులు బద్దలు కావడానికి కారణం ఈ మ్యాచుల్లో ఉపయోగించిన పింక్ బాల్ అని చెప్పుకోవచ్చు. మరి, పింక్ బాల్ ప్రత్యేకత ఏంటి? మిగిలిన బాల్స్ కంటే దీన్ని ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నారు? వంటి విశేషాలన్నీ తెలుసుకుందాం.
సాధారణంగా క్రికెట్ లో ఎరుపు, తెలుపు, పింక్ మూడు రంగుల బాల్స్ ని ఉపయోగిస్తారు. ఈ మూడు రకాల బాల్స్ ని కార్క్, రబ్బర్, ఉలెన్ దారం ఉపయోగించి తయారు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా వీటిని తయారుచేసేందుకు వేర్వేరు సంస్థలు ఉన్నా.. అన్ని చోట్లా తయారీకి ఒకటే పద్ధతిని ఉపయోగించడం విశేషం. ఈ బాల్స్ అన్నింటిలో వాటి రంగు, ఫినిషింగ్ ని బట్టి ఏ మ్యాచ్ కి ఏ బాల్ ఉపయోగించాలని నిర్ణయిస్తారు. ఇక పింక్ బాల్ విషయానికి వస్తే మిగిలిన రెండు బాల్స్ కి లేని కొన్ని ప్రత్యేకతలు దీని సొంతం.
పింక్ బాల్ లో చుట్టూ ఒక లేయర్ లక్క కోటింగ్ ఉపయోగిస్తారు. ఈ కోటింగ్ వల్ల పింక్ బాల్ కి షైనింగ్ పెరుగుతుంది. రాత్రి సమయంలోనూ ఇది బాగా కనిపించేలా చేస్తుంది. అందుకే దీన్ని డే నైట్ టెస్టులో ఉపయోగిస్తారు. ఈ బాల్ ని మొదటిసారి 2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఉపయోగించారు. ఈ మ్యాచ్ లో మూడు వికెట్ల తేడా ఆస్ట్రేలియా గెలుపొందింది.
డే నైట్ టెస్టుల్లో బాల్ కనిపించడం బ్యాట్స్ మెన్ కి కష్టంగా మారుతుంది. పింక్ బాల్ మెరుస్తూ ఉండడం వల్ల ఇది ఫ్లడ్ లైట్ల వెలుగులో వారికి బాగా కనిపిస్తుంది. పింక్ బాల్ బాగా స్వింగ్ అవుతుంది. లక్క కోటింగ్ వల్ల బాల్ వేగంగా కదులుతుంది. దీంతో వికెట్లు తీయడం, రన్స్ సాధించడం సులువు. తాజాగా జరిగిన మూడో టెస్టులో బాల్ వేగంగా కదలడం వల్ల 21 అవుట్ ఆఫ్ 30 డిస్మిసల్స్ జరిగాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈ పింక్ బాల్స్ ని కూకబుర్రా అనే సంస్థ తయారుచేస్తుంది. అయితే భారత్, ఇంగ్లండ్, వెస్ట్ ఇండీస్, ఐర్లాండ్ దేశాలు మాత్రం పింక్ బాల్ ని తమ దేశాల్లోనే స్థానికంగా తయారుచేయించుకుంటున్నాయి. బీసీసీఐ కి పింక్ బాల్స్ ని మీరట్ కి చెందిన సన్స్ పరెల్స్ గ్రీన్ ల్యాండ్స్ (ఎస్ జీ) అనే సంస్థ తయారుచేసి అందిస్తుంది.
ఇప్పటివరకూ పింక్ బాల్ తో 16 డే నైట్ టెస్టులు జరిగాయి. అందులో రెండు మాత్రం రెండు రోజుల పాటు కొనసాగగా మిగిలినవన్నీ మూడు రోజుల పాటు జరిగాయి. డే నైట్ టెస్ట్ లో పింక్ బాల్ ఉపయోగించడం వల్ల గ్రాస్ పిచ్ కూడా స్వింగ్ కి అనుకూలించడం వల్ల పేసర్ల హవా కొనసాగుతుంది. కానీ దీనికి భిన్నంగా తాజాగా అహ్మదాబాద్ లో జరిగిన టెస్టులో మాత్రం స్పిన్లర్ల హవా నడిచింది. ఇరు టీమ్ లకు చెందిన స్పిన్నర్లు కలిసి 28 వికెట్లు తీయడం విశేషం. ఈ బాల్ ని మొదటి సారి ఉపయోగించిన జట్టు ఆస్ట్రేలియా. మన దేశంతోనూ పింక్ బాల్ టెస్ట్ ఆడేందుకు ఆస్ట్రేలియా ఆసక్తి చూపించింది. 2018-19 లో భారత జట్టు ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా డే నైట్ టెస్టును నిర్వహించి పింక్ బాల్ ని ఉపయోగించాలని ఆ దేశం భావించినా బీసీసీఐ దానికి నిరాకరించింది. భారత జట్టు తన మొదటి పింక్ బాల్ డే నైట్ టెస్టును బంగ్లాదేశ్ తో ఆడింది. 2019 నవంబర్ లో ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్ తో పాటు సిరీస్ లోని అన్ని మ్యాచులు గెలిచి సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసింది భారత్.