ఇంగ్లండ్ (England) లో పుట్టి అక్కడ విజయవంతమైన పొట్టి క్రికెట్ (T20 Cricket) కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చింది నిస్సందేహంగా ఐపీఎల్ (IPL) అనేది ఎవ్వరూ కాదనలేని అంశం. క్రికెట్ (Cricket)లో ఐపీఎల్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ క్రికెట్లో భారత్ (India) అగ్రస్థానంలో నిలవడానికి, బీసీసీఐ (BCCI) రిచెస్ట్ బోర్డ్ అవ్వడానికి కూడా కారణం ఇదే.
ప్రతి ఏడాది ఐపీఎల్ వల్ల బీసీసీఐ ఆదాయం పెరుగుతోంది.. తప్ప తగ్గడం లేదు. బీసీసీఐ పాలిట కామధేనువులా మారింది ఐపీఎల్. ఇక, బీసీసీఐపై మరింత కనకవర్షం కురిపించడానికి రెడీ అయింది ఈ క్యాష్ రిచ్ లీగ్. ఐపీఎల్ త్వరలోనే మరో భారీ డీల్ కుదుర్చుకోవడానికి సిద్ధమవుతోంది. 2023-28 కాలానికి గాను ఐపీఎల్ మీడియా హక్కుల (IPL Media Rights) ద్వారా బీసీసీఐకి వేల కోట్ల ఆదాయం రానుంది.
భారత్ లో క్రికెట్ కు ఉన్న క్రేజ్, నానాటికీ పెరుగుతున్నదని, ఐపీఎల్ విస్తృతి కారణంగా ఈ డీల్ ద్వారా బీసీసీఐ మరింత సంపన్న బోర్డుగా మారనున్నట్లు సదరు సంస్థ అంచనా వేసింది. గత నెలలో మీడియా హక్కులకు సంబంధించిన టెండర్ ను బీసీసీఐ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈనెల 12న ఇందుకు సంబంధించిన ఈ-వేలాన్ని నిర్వహించనున్నారు.
ఐపీఎల్ ప్రసార హక్కుల విక్రయానికి బేస్ ప్రైజ్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఐపీఎల్లో టీవీ ప్రసార హక్కుల కోసం ఒక్కో మ్యాచ్‌కి రూ.49 కోట్లు బేస్ ప్రైజ్ నిర్ణయించిన బీసీసీఐ, డిజిటల్ హక్కుల కోసం మరో రూ.33 కోట్లు బేస్ ప్రైజ్‌గా నిర్ణయించింది. అలాగే మధ్యహ్నం జరిగే నాన్ ఎక్స్‌క్లూజివ్ మ్యాచులకు ఒక్కో మ్యాచ్‌కి రూ.16 కోట్లు బేస్ ప్రైజ్ నిర్ణయించిన బీసీసీఐ, ఇండియాలో కాకుండా బయటి దేశాల్లో మ్యాచుల ప్రసారానికి అదనంగా ప్రతీ మ్యాచ్‌కీ మరో రూ.3 కోట్లు చెల్లించాల్సిందిగా బేస్ ప్రైజ్ నిర్ణయించింది.
ఐపీఎల్ 2023 నుంచి 2027 సీజన్ వరకూ ఐపీఎల్ ప్రసార హక్కులను వేలం వేయనుంది బీసీసీఐ. అంటే మొత్తంగా 370 మ్యాచుల ప్రసారం హక్కులకు కలిపి బేస్ ప్రైజ్ లెక్కలు వేసుకున్నా రూ.32,890 కోట్లు బీసీసీఐ ఖాతాలో చేరబోతున్నాయి. బేస్ ప్రైజ్ నుంచి బిడ్ పైకి వెళ్లేకొద్దీ బీసీసీఐ ఖాతాలో చేరే సొమ్ము ఎంతకి పెరుగుతుంది, ఎన్ని వేల కోట్లకు చేరుతుందనేది తేలిపోతుంది.