2023 వన్డే ప్రపంచకప్ (2023 ODI World Cup)కు ముందు ఇండియన్ క్రికెట్ టీం (Indian Cricket Team) పరిస్థితి అభిమానుల్లో ఆందోళనకు కారణమవుతోంది. వరుస పరాజయాలతోపాటు రోహిత్(Rohit Sharma) పరుగులు చేయలేకపోతుండటంపై చర్చ మొదలైంది. వాస్తవానికి టీమ్ ఇండియా వైట్-బాల్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ప్రయాణం అద్భుతంగా ప్రారంభమైంది.
ఇటీవలే జరిగిన బంగ్లాదేశ్ మొదటి వన్డేలో కూడా రోహిత్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై వాషింగ్టన్ సుందర్‌ని ఐదు ఓవర్లకే పరిమితం చేశాడు. భారత్ కెప్టెన్ మైదానంలో ఎల్లప్పుడూ చిరాకుగా కనిపిస్తున్నాడని కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇండియా కెప్టెన్, టీం మేనేజ్మెంట్ సరైన జట్టును ఎంపిక చేయడంలోనూ విఫలమవుతున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
* పరుగులు చేయడంలో విఫలం : అంతర్జాతీయ క్రికెట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండింటిలోనూ భారీ స్కోర్లు సాధించడంలో ఓపెనర్ రోహిత్ విఫలమయ్యాడు. దీంతో ఇండియన్ టీ20 టీంలో రోహిత్ స్థానం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. పరుగులు చేయడంలో ఇలాగే ఇబ్బందిపడితే వన్డే టీంలో అతని చోటుపై కూడా చర్చ మొదలయ్యే సూచనలు ఉన్నాయి.
అతని పరిస్థితిని కాస్త అర్థం చేసుకున్నా.. ఇండియా కెప్టెన్‌కు ఉండాల్సిన అత్యున్నత ప్రమాణాలు సరిపోలడం లేదు. రోహిత్ గత రెండు సంవత్సరాలలో అనేక గాయాలకు గురయ్యాడు. టీంలోని మిగతా కొందరి సభ్యులు లాగే రోహిత్ ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మంచి ఇన్నింగ్స్‌తో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది.