సరిగ్గా...పదేళ్ల క్రితం.. ఈ రోజు కోట్లాది మంది క్రికెట్ అభిమానుల కల నేరవేరిన రోజు. 1983లో భారత్ మెుట్ట మెుదటి ప్రపంచ కప్ గెలిచిన తర్వాత దాదాపు టీమిండియా 25 ఏళ్ళుగా ఎదురుచూసిన ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీలంక పేసర్ నువాన్ కులశేఖర వేసిన 49వ ఓవర్ రెండో బంతిని లాంగాన్ మీదుగా ధోనీ (Ms Dhoni) సిక్స్‌గా మలచిన షాట్ అందరి మనసుల్లో పదేళ్లుగా అలా ముద్రించుకుపోయింది.
2011 వన్డే ప్రపంచకప్ విజయానికి శుక్రవారంతో పదేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా గౌతమ్ గంభీర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... " ఒక వ్యక్తి మాత్రమే ప్రపంచకప్ గెలిచారని మీరు అనుకుంటున్నారా?. ఒక వ్యక్తి ప్రపంచకప్ గెలవగలిగితే.. భారత్ ఇప్పటివరకు అన్ని టోర్నీలు గెలిచేది. దురదృష్టం ఏంటంటే.. భారతదేశంలో కొంతమంది వ్యక్తులను ఎక్కువగా ఆరాధిస్తుంటారు. నేను అలాంటివి ఎప్పుడూ నమ్మను. జట్టు ఆటలో వ్యక్తులకు స్థానం లేదు. ఆస్ట్రేలియాపై యువరాజ్ సింగ్ ఆటను మరచిపోగలరా?. ఫైనల్లో జహీర్ ఖాన్ సహకారాన్ని మీరు మరచిపోగలరా?. దక్షిణాఫ్రికాపై సచిన్ టెండూల్కర్ చేసిన సెంచరీ సంగతేంటి?. ఆ ఒక సిక్స్ గురించే ఎందుకు చర్చిస్తారు. 2007 ప్రపంచకప్‌లో ఆరు సిక్సులు బాదిన యువరాజ్ ఎవరూ మాట్లాడరే" అని ప్రశ్నించాడు.
" 2011లో అసాధ్యమైనదేదీ మేం అందుకోలేదు. ప్రపంచకప్ కోసం జట్టులోకి ఎంపికైనప్పుడే గెలవాలనే లక్ష్యం పెట్టుకున్నాం. ఆ క్రమంలోనే మేం దేశం గర్వపడేలా చేశాం. ప్రజలు ఆనందపడ్డారు. 2015, 2019 వన్డే ప్రపంచకప్‌ల్లోనూ గెలిస్తే అప్పుడు ప్రపంచ క్రికెట్లో టీమిండియాను సూపర్ పవర్‌గా పరిగణించేవాళ్లేమో. కానీ పదేళ్లవుతున్నా మరో ప్రపంచకప్ గెలవలేకపోయాం. అందుకే ఈ ప్రత్యేక సందర్భంలో గతం గురించి ఎక్కువగా మాట్లాడకూడదని అనుకుంటున్నా. మేం మా బాధ్యతలు నిర్వర్తించాం అంతే. ఏప్రిల్ 2న మేం చేసింది ఇతరుల మేలు కోసం కాదు. గతం కంటే భవిష్యత్ మీద ధ్యాస పెట్టడం అవసరం" అని గౌతీ తెలిపాడు.