ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే.. దూకుడుగా ఉంటూ విపక్షాలకు ఘాటు కౌంటర్లు ఇస్తారు. తమ అధినేత జగన్ పై చిన్న విమర్శ చేసినా ఊరుకోరు వెంటనే కౌంటర్లు ఇస్తూ ఉంటారు.. గతంలో దివంగత నేత వైఎస్ఆర్ అన్నా అంతే అభిమానం.. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో మంత్రి పదవి ఆశిస్తున్నవారిలో ఆయన కూడా ఒకరు.. సీనియర్ ఎమ్మెల్యేగా తనకు మంత్రి పదవి దక్కుతుంది ఆశిస్తున్నారు. కానీ ఇలా సెడన్ గా మహా మునిలా అవతారం ఎత్తేసరికి.. చూసిన వారంతా షాక్ అవుతున్నారు. తరువాత విషయం తెలిసి.. అదా సంగతి అనుకుంటున్నారు..
తాజాగా మన్యం ఆరాధ్య దేవత మోదకొండమ్మ జీవితం ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న జై మోదకొండమ్మ సినిమా చిత్రీకరణలో ఆయన పాల్గొన్నారు. పాడేరు ఘాట్ రోడ్డులో సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. కరోనా కారణంగా గతంలో నిలిచిపోయిన షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. శ్రీమోదవందన్ సినిమా టాకీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుతీర్థ మహామునిగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నటిస్తున్నారు.
సినీ నటులు ప్రేమ, శివకృష్ణ, కృష్ణవేణి, సత్యప్రకాష్, శివాజీరాజా, గణపతి, పొట్టి విజయ, దేవరాపల్లి శ్రీను తదితరులు చిత్రీకరణలో పాల్గొన్నారు. కోమాలమ్మ పనుకు, 12 మైళ్లు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ధర్మశ్రీపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. 75 శాతం షూటింగు పూర్తయ్యిందని, దసరాకు విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు పేర్కొన్నారు.