పసుపు రైతులను పట్టించుకుంది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎంపీ కవిత స్పష్టం చేశారు. పసుపు రైతుల కష్టాలు తెలిసిన సిఎం కేసీఆర్ రూ.4 లక్షల ధర ఉండే పసుపు బాయిలర్లకు రెండు లక్షల సబ్సిడీ ఇచ్చారని, ఈ ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిది అని అన్నారు. కోరుట్ల నియోజకవర్గం లో 100 మంది పసుపు రైతులకు రెండు లక్షల చొప్పున బాయిలర్లు కొనుగోలుకు సబ్సిడీ ఇచ్చామని తెలిపారు రైతన్నల సమస్యలపైన చిత్తశుద్ధితో పని చేసేది టిఆర్ఎస్ పార్టీ మాత్రమేనన్నారు.
పసుపు రైతుల ఆవేదన తమకు అర్థమైంది కాబట్టే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి కేంద్రం పై ఒత్తిడి తెచ్చామని కవిత చెప్పారు. అయినా ప్రధాని నరేంద్ర మోదీకీ మనసు కరగలేదన్నారు. బిజెపి నాయకుడు రాంమాధవ్ పసుపు రైతులకు ఏదో చేస్తున్నట్లు చిలక పలుకులు పలుకుతున్నారని విమర్శించారు. పసుపు బోర్డు సాధన పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
అన్ని రకాల పెన్షన్లను ప్రభుత్వం డబుల్ చేసిందని మే 1 నుంచి పెరిగిన పెన్షన్ల డబ్బు చేతికి అందుతుంది అని కవిత తెలిపారు. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ. 3వేలను ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. కులవృత్తులకు లోన్లు ఇప్పిస్తామని తెలిపారు. డ్వాక్రా మహిళలకు ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టించి వారి ఆదాయాన్ని పెంచుతామని హామీ అన్నారు.
సోషల్ మీడియాలో బిజెపి దుష్ప్రచారాలపై యువకులు అప్రమత్తంగా ఉండాలని కవిత కోరారు. మనం ఇస్తున్న వెయ్యి రూపాయల పెన్షన్లలో రూ.800 కేంద్రమే ఇస్తోందని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అదే నిజమైతే నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రంలో రూ.750 మాత్రమే ఎందుకిస్తున్నారని ప్రశ్నించారు. బిజెపి నాయకులు చేస్తోంది గోబెల్స్ ప్రచారం అని అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు.