బెంగాల్ ఎన్నికలు : వచ్చే ఎన్నికల్లో బెంగాల్లో మూడింట రెండు వంతల స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో 18 స్థానాలు గెలిచి సత్తా చాటామని గుర్తుచేశారు. ఇక గంగూలీ బీజేపీలో చేరబోతున్నారా? అన్న ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు. ఇప్పటికైతే గంగూలీతో చర్చలు జరపలేదని.. కానీ భవిష్యత్లో ఏదైనా జరగవచ్చునని తెలిపారు.
మహారాష్ట్ర ఎన్నికలు : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి,బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. బీజేపీ-శివసేన కలిసి మూడింటిలో రెండొంతుల సీట్లను గెలుచుకుంటాయన్నారు. బీజేపీ గెలిస్తే మళ్లీ ఫడ్నవీసే సీఎం అవుతారని చెప్పారు. డిప్యూటీ సీఎం పదవిని శివసేనకు ఇచ్చేది లేనిది ఫడ్నవీస్ టీమ్ నిర్ణయిస్తుందన్నారు.
హర్యానా ఎన్నికలు : అవినీతి లేని ప్రభుత్వాన్ని నడిపినందుకు హర్యానా బీజేపీపై అక్కడి ప్రజల మద్దతు ఉంది. ఆర్టికల్ 370 రద్దును అక్కడి ప్రజలు కూడా స్వాగతించారు. హర్యానాలోనూ మూడింట రెండు వంతుల స్థానాలు మాకే దక్కుతాయన్న ధీమా ఉంది. భారత ప్రజానీకానికి మోదీ చేసిన గొప్ప పని ఏంటంటే.. కులతత్వం,పక్షపాతం లేని పారదర్శక పాలన అందిస్తున్నారు.
వీర్ సావర్కర్కి భారతరత్న : హిందుత్వ సిద్దాంతకర్త వీర్ సావర్కర్కి భారతరత్న అవార్డు ఇవ్వాల్సిందే. భారతరత్న అవార్డుకు సంబంధించిన నియమ నిబంధనలు నాకు తెలియవు. కానీ దేశం కోసం సావర్కర్ త్యాగం చేసినంతగా మరొకరు చేయలేదు. ఆయన జీవితం నిరాడంబరం,స్ఫూర్తిదాయకం. భారతరత్నకు ఆయన అన్ని విధాలా అర్హుడు. ఒకవేళ భారతదేశం హిందూ రాజ్యంగా మారినా.. రాజ్యాంగబద్దంగానే కొనసాగుతుంది.
ఎన్ఆర్సీ-జాతీయ పౌరసత్వ ముసాయిదా : 2024కి ముందే దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ నిర్వహిస్తాం. పశ్చిమ బెంగాల్లో వచ్చే ఎన్నికల నాటికి ఇదే ప్రధాన ఎజెండా అవుతుంది. దేశంలోని పలుచోట్ల నిర్బంధ క్యాంపులను నిర్మిస్తాం. పొరుగు దేశాల నుంచి భారత్కి వచ్చిన ముస్లింలపై ఎలాంటి విద్వేషం,హింస ఉండబోదు. వాళ్లను శరణార్థులుగా పరిగణించబోము. ముస్లిమేతరులను మాత్రమే శరణార్థులుగా పరిగణిస్తాం. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో పాకిస్తాన్ జనాభా 30శాతం ఉంటే.. ఇప్పుడది 6శాతానికి పడిపోయిందన్నారు.