వైఎస్ అభిమానులతో పాటు.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారందరు రేపు ఏం జరుగుతోంది అని ఆసక్తిగా ఎదురు చూస్తారు అనడం అతిశయోక్తి కాదు.. ఎందుకంటే రక్షబంధన్ అన్నది అన్నా చెల్లెల్ల బంధానికి ప్రతీక. తప్పకుండా ప్రతి అన్నా చెల్లిని కలిసి ఆశీర్వదించాలని.. ప్రతి చెల్లి తన అన్నను కలిసి దీవెనలు తీసుకోవాలని ఆశిస్తుంది. మరి అత్యంత ముఖ్యమైన రక్షాబంధన్ అన్నా-చెల్లెల్ని కలుపుతుందా..? లేదా అన్నది చూడాలి..?
వైఎస్ జగన్ - వైఎస్ షర్మిల ఇద్దరూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సొంత రాజకీయ పార్టీల అధినేతలు.. ఒకే కుటుంబం నుంచి ..ఒక్కటిగా ఎదిగి...ఒకరి కోసం మరొకరు అన్నట్లుగా అడుగులో అడుగు వేసిన ఈ ఇద్దరు ఇప్పుడు.. ఎవరికి వారు అన్నట్టు ఉన్నారు. షర్మిల రాజకీయ పార్టీ పెడుతుంది అన్న ప్రచారం ప్రారంబైన నుంచి.. పార్టీ పెట్టిన తరువాత కూడా ఇప్పటి వరకు అన్నా చెల్లి కలిసిన సందర్భం ఒక్కటీ కనిపించలేదు. ఎంతో ముఖ్యమైన తండ్రి వర్ధంతి రోజు కూడా దూరం దూరం అన్నట్టే ఉన్నారు. మరి ఇప్పుడు రాఖీ పండుగ అయినా వారిద్దర్నీ కలుపుతుందా..? లేదా అని అంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.
ప్రతీ ఏటా వైఎస్సార్ జన్మదినం- క్రిస్మస్- రాఖీ ఈ మూడు పండుగలు ఎవరు ఎక్కడ ఉన్న కలిసి చేసుకోవటం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఇప్పటికే వైఎస్సార్ జన్మదినం రోజు ఇద్దరు వేర్వేరుగా నివాళులర్పించారు. ఒకరికి ఒకరు ఎదురు పడకుండా షెడ్యూల్ మార్చుకున్నారు. అన్న ఉన్నారని షర్మిళ ఎయిర్ పోర్టుకు లేటుగా వెళ్లారు కూడా.. మరి అన్నా చెల్లెల అనుబంధానికి గుర్తుగా చేసుకునే రాఖీ పండగ రోజైనా కలుస్తారా అన్నది చూడాలి..
వైసీపీ నేతలు చెబుతున్నదాని ప్రకారం.. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం జగన్ కు ఇష్టం లేదని.. ఆ విషయం మినహా మరే విషయంలో విబేధాలు లేవని అంటున్నారు. అయితే అంతమాత్రన.. అన్న చెల్లెల్ల బంధం దూరమవుతుందా..? షర్మిల కూడా గతంలో రాఖీ రోజు అన్నకు రాఖీ కడతా..అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఆ తరువాత ఇద్దరి మధ్య మరింత గ్యాప్ పెరిగినట్టు పరిణామాలు కనిపిస్తున్నాయి.
వైఎస్సార్ జన్మదినం ( గత నెల 8వ తేదీన) నాడు అక్కడకు ఉదయం సమయంలో తొలుత వెళ్లాలని సీఎం జగన్ భావించారు. అయితే, షర్మిల అదే రోజు పార్టీ ఏర్పాటు ప్రకటన ఉండటంతో ..ఉదయం సమయంలోనే తండ్రికి నివాళి అర్పించాలని నిర్ణయించారు. దీంతో..జగన్ రాజకీయంగా ఎటువంటి అనుమానాలను తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతో తన షెడ్యూల్ మార్చుకున్నారు. సాయంత్రం సమయంలో వెళ్లి తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించారు. పొరుగు రాష్ట్రంతో సఖ్యత కోరుకొనే తాము..అక్కడి రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదనేది తమ విధామని సీఎం జగన్ ..ఆయన సలహాదారుడు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.
ఇప్పటి వరకు దీనిపై ఇటు వైసీపీ వర్గాలు కానీ.. షర్మిల సన్నిహితులు కానీ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. ఒక వేళ విబేధాలు ఉన్నా.. రక్షా బంధన్ రోజు విడివిడిగా ఉండడం ఎందుకని.. షర్మిల రాఖీ కడితే విబేధాలపై విమర్శలు కాస్త తగ్గుతాయి. ఒకవేళ ఇద్దరు రేపు కలవకపోతే.. కచ్చితంగా ఇద్దరి మధ్య తీవ్రమైన విబేధాలు ఉన్నాయని అంతా ఫిక్స్ అవుతారు..