Chandrababu Naidu Crying: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. మీడియాతో మాట్లాడుతూ వెక్కి వెక్కి ఏడ్చారు. ఈ ఘటన అందరినీ కలిసి వేసింది. కారణం ఏదైనా చంద్రబాబు ఏడవడంతో సామన్యులు కూడా అయ్యో పాపం అనుకున్నారు. ఇక వైఎస్ఆర్ సీపీ, జగన్ అభిమానులు మాత్రం.. చేసిన పాపం ఊరికే పోతుందా అంటూ సెటైర్లు వేశారు. ఇప్పటికీ చంద్రబాబు ఏడుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి.
అయితే చంద్రబాబు అంతలా ఏడవడానికి కారణం ఏంటి.. అసెంబ్లీ సాక్షిగా తన భార్యను అవమానించారు అంటూ చంద్రబాబు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అందుకే ఇకపై అసెంబ్లీకి రానని.. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే అడుగు పెడతాను అంటూ శపథం చేశారు. అయితే దీనిపై స్వయనా ముఖ్యమంత్రి జగన్ వివరణ ఇచ్చారు. చంద్రబాబు కుటుంబ గురించి ఎవరూ మాట్లాడలేదన్నారు. ఆయనకే కుటుంబ సభ్యులను విమర్శించే అలవాటు ఉందంటూ కౌంటర్ ఇచ్చారు..
ఇక ఎమ్మెల్యే రోజా అయితే ఓ అడుగు ముందుకు వేసి.. ఇన్నాళ్లకు ఎన్టీఆర్ ఆత్మ శాంతించింది అన్నారు. గతంలో తనను బ్లూ ఫిల్మ్స్ లో నించాను అంటూ పీతల సుజాతతో అనిపించారని.. మాకు మాత్రం కుటుంబాలు ఉండవా అంటూ రివేంజ్ తీర్చకున్నారు. చంద్రబాబుకు ఇదే అసెంబ్లీలో ఆఖరి రోజు అంటూ మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు..
అధికార పార్టీ నేతల వెర్షన్ ఎలా ఉన్నా.. చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టడానికి ఇదే కారణం మని తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీలో ముఖ్యంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా చంద్రబాబుపై మాటల యుద్ధం చేశారు. అసెంబ్లీలో వ్యవసాయ చట్టాలపై చర్చ నడుస్తున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ గురించి వైసీపీ ఎమ్మెల్యేలు అసభ్యకరంగా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లోకేష్ ఎలా పుట్టాడో తెలుసా అని ఓ ఎమ్మెల్యే నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఆ వీడియోలో వినిపిస్తోంది. వెంటనే జోక్యం చేసుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి.. ఆగండి అని వారించారు. తరువాత మంత్రి కొడాలి నాని కూడా తన నోటికి పనిచెప్పారు. ఆ లోకేష్ గాడు ఎలా పుట్టాడో వాడికే తెలియదు అంటూ ఆరోపించారు. వీళ్లిద్దరి వ్యాఖ్యలకు చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని… తన కుటుంబం గురించి మాట్లాడటంపై కలత చెంది అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారని తెలుస్తోంది. మరి ఆ వీడియో ఎంత వరకు నిజం అన్నది స్పీకర్ తమ్మినేని పుటేజ్ విడుదల చేస్తే కానీ తెలియదు.
చంద్రబాబు కన్నీరు పెట్టడం.. వైసీపీ నేతలు నారా భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో ఇంతకాలం ఉప్పు నిప్పులా ఉన్న బీజేపీని.. వైసీపీ దగ్గర చేసినట్టు అయ్యింది. ఎందుకంటే టీడీపీ అన్నా.. చంద్రబాబు అన్న అంత ఎత్తున లేచే సోము వీర్రాజు కూడా చంద్రబాబుకు సపోర్ట్ గా తొలి సారి మాట్లాడారు. ఈ రోజు శాసన సభలో పరిణామాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. శాసనసభ హుందాతనం, గౌరవం కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం అన్నారు. ఈరోజు జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా సీఎం జగన్ బాధ్యత తీసుకోవాలి. వ్యక్తిగత విమర్శలు హృదయాలను గాయపరుస్తాయి. ఈ రోజు సంఘటన శాసనసభకు మాయని మచ్చగా భావించాలి అని తెలిపారు.
చంద్రబాబు అంటేనే నిత్యం ఆగ్రహంతో ఊగిపోయే దగ్గుబాటి పురందేశ్వరి కూడా చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి స్పందించారు. చంద్రబాబు సతీమణి, తన సోదరి భువనేశ్వరిపై వైసీపీ నేతలు నీచంగా మాట్లాడిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఇవాళ జరిగిన ఘటనతో తన మనసు నిజంగా గాయపడిందని తెలిపారు. అక్కాచెల్లెళ్లుగా తామిద్దరం ఎన్నో విలువలతో పెరిగామని పేర్కొన్నారు. ఈరోజు అసెంబ్లీలో వైసీపీ నేతలు మాట్లాడిన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేమని పురంధేశ్వరి స్పష్టం చేశారు.
బీజేపీ నేత సుజనాచౌదరి కూడా భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఏపీలో రాజకీయాలు ఇంత అథమస్థాయికి పడిపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఇన్నాళ్లు వ్యక్తిగత దూషణలు జుగుప్స కలిగించాయనుకుంటే, ఈరోజు చంద్రబాబు అర్ధాంగిని అసభ్యంగా దూషించడం ద్వారా వైసీపీ రాష్ట్ర రాజకీయాలను నీచాతినీచ స్థాయికి దిగజార్చిందని విమర్శించారు. ఇది సిగ్గుచేటు అని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఇలా బీజేపీ నేతలంతా క్యూ కట్టి చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు.. ఇప్పటికే చంద్రబాబు బీజేపీకి దగ్గర అవ్వడానికి సరైన సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు బీజేపీ నేతలు స్వయంగా చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడారు. అలాగే త్వరలోనే అమరావతి రైతులకు మద్దతుగా బీజేపీ జనసేన టీడీపీ కలిసి ఉమ్మడిగా పోరాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే 2024 నాటికి ఈ మూడు పార్టీలు కలిసి పోటీ పడే అవకాశం ఉంది..