AP CM Jagan - Telangna CM Jagn Photos viral: మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి.. రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జలవివాదాదల నేపథ్యంలో రెండు రాష్ట్రాల మంత్రులు ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటునే ఉన్నారు. ఆ మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ కలిసి ముచ్చట్లు పెట్టుకోవడం ఆసక్తికరంగా మారింది..
ఏపీ సీఎం జగన్-తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. మరోసారి అది బయట పడింది. తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ హాజరయ్యారు. శంషాబాద్లో జరిగిన వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కేసీఆర్, జగన్ పక్కపక్కనే కూర్చొని కాసేపు ముచ్చటించుకున్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల విషయంలో ఉప్పు నిప్పులా పరిస్థితి ఉన్నా.. ఇద్దరు సీఎంలు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకోవడం చూస్తే.. వారిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటో అర్థం చేసుకోవచ్చు.
అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్న సందర్భంలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఇటీవల పెను దుమారమే రేగింది. వైసీపీ మూకుమ్మడి మాటల దాడితో చంద్రబాబు.. మళ్లీ సీఎం అయ్యాకే సభలతో అడుగుపెడతా అంటూ శపథం చేశారు. ఆ వెంటనే మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తన భార్యను వ్యక్తిగతంగా దూషించారు అంటూ వెక్కి వెక్కి ఏడ్చారు. దీనిపై చంద్రబాబుకు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. తెలంగాణ నుంచి కూడా చాలామంది వైసీపీ తీరును తప్పు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇద్దరు సీఎంలు వ్యక్తిగతంలో ముచ్చట్లు పెట్టడం వైరల్ గా మారుతోంది.
అంతే కాదు మొదటిలో ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఉందని ప్రచారం జరిగినా.. ఇటీవల కొంత గ్యాప్ వచ్చినట్లు కనిపించింది. జల వివాదం పై రెండు రాష్ట్రాల మధ్య వార్ నడిచింది. ఏపీ, తెలంగాణ మంత్రులు మాటల యుద్ధానికి దిగారు. పరస్పర సవాళ్లు కూడా విసురుకున్నారు. పాలనపైనా సెటైర్లు వేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జగన్, కేసీఆర్ లు కలుసుకోవడం... గుసగుసలు మాట్లాడుకోవడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి పెళ్లి శంషాబాద్ లో జరిగింది. ఈ వివాహానికే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఇద్దరూ ఒకే సమయంలో రావడంతో పక్కపక్కనే కూర్చుకున్నారు. దాదాపు 10 నిమిషాల పాటు ఇద్దరు మాట్లాడుకున్నారు. జగన్ చెవిలో కేసీఆర్ ఏదో చెబుతూ కనిపించారు. జగన్ కూడా కేసీఆర్ ఏదో వివరించారు.
అందుకే వీరిద్దరి ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారాయి. ఏపీ సీఎం జగన్... కేంద్ర దగ్గర అడుక్కుంటున్నారంటూ వారం రోజుల క్రితం కామెంట్ చేసి కాక రాజేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అయితే వివాహ వేడుకలో ప్రశాంత్ రెడ్డి కూడా జగన్ దగ్గరే ఉన్నారు. అందరూ టీఆర్ఎస్, వైసీపీ నేతలు అంతా నవ్వుతూ ముచ్చట్లు పెట్టుకోవడం ఫోటోల్లో చూడొచ్చు.
జగన్, కేసీఆర్ లు ఏం మాట్లాడుకున్నారన్నది ఇప్పుడు చర్చగా మారింది. జల వివాదంపై మాట్లాడుకున్నారా? కేంద్రంతో ఎలా వ్యవహరించాలన్న దానిపై చర్చించారా అన్నది ఆసక్తిగా మారింది. లేక చంద్రబాబు కన్నీటి వ్యవహారంపై ఇద్దరూ మాట్లాడుకున్నారా అని కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇద్దరికీ చంద్రబాబు ఉమ్మడి శత్రువు ఈ నేపథ్యంలో వీరిద్దరు చంద్రబాబు గురించి మాట్లాడుకున్నారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే చంద్రబాబు ను ఏడిపించడం ఎందుకని సీఎం కేసీఆర్ సలహా ఇచ్చి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..
వారిద్దరి మధ్య ఏ విషయంలో చర్చ జరిగినా.. సోషల్ మీడియాలో మాత్రం.. నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా రైతులు ఇబ్బంది పడుతుంటే.. వారి సమస్యలు పట్టించుకోని సీఎంలు.. ఇలా దావత్ లు అంటూ తిరగడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు పెళ్లికి హాజరవ్వడం కూడా తప్పేనా అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత కేసీఆర్, జగన్ కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.