భద్రాచలం చేరుకున్న నారా లోకేష్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పొదెం వీరయ్యతో పాటు రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, టీడీపీ నాయకులు బక్కని నర్సింహులు, కొండపల్లి రామచంద్రరావు, కొడాలి శ్రీనివాసన్, కుంచాల రాజారామ్, కోనేరు రాము, ఎస్కే అజీమ్, రంజిత్, జ్యోతుల నవీన్, వరపుల రాజా, ఆదిరెడ్డి వాసు తదితరులు ఉన్నారు.
పోలవరం (polavaram)ముంపు మండలాల పర్యటనలో భాగంగా ముందుగా లోకేష్ భద్రాచలం చేరుకుని.. సీతారామా స్వామి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఏపీ పరిధి పోలవరం ముంపు మండలాల్లోని ఐదు పంచాయతీల సమస్యపై.. తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి మాట్లాడుకుంటే రెండు నిమిషాల్లో పరిష్కారమవుతుందని అభిప్రాయపడ్డారు..
ఇవాళ రేపు కూడా పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో లోకేష్ పర్యటన కొనసాగనుంది. పోలవరం నిర్వాసితుల పరామర్శలు రేపు కూడా ఉంటాయి. ఈ పర్యటనలో పోలవరం ప్రాజెక్టు ముంపు నిర్వాసితుల సమస్యలు విని వారికి తగిన సూచనలు చేయనున్నారు లోకేష్. ఇవాళ భద్రాచలం, టేకులబోరు, శ్రీరామగిరి, చింతూరులో.. రేపు రంపచోడవరం, దేవీపట్నం, పెదవేంపల్లి, ఇందుకూరు, ముసిరిగుంట, కృష్ణునిపాలెంలో లోకేష్ పర్యటన కొనసాగనుంది.
ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ భవనం కూలిపోయి ఓ విద్యార్థి మృత్యువాత పడిన ఘటనపైనా లోకేష్ తీవ్ర స్థాయిలో జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు. మార్కాపురం మండలం రాజుపాలెంలో పలువురు విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా భవనం పైకప్పు కూలిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడే ఉన్న విష్ణు అనే విద్యార్థి స్పాట్లోనే ప్రాణాలను కోల్పోయాడు. రాష్ట్రవ్యాప్తంగా నాడు- నేడు కార్యక్రమం కింద పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి అని చెప్పుకొచ్చే సీఎం జగన్ దీనిపై సిగ్గుతో తలవంచుకున్నారంటూ లోకేష్ ఎద్దేవా చేశారు.