టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మారారా? ఇంత మార్పు ఏంటి అని టీడీపీ కేడరే షాక్ కు గురవుతోందా? ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరపున ఆయన ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం లోకేష్ ప్రచార శైలి అందర్నీ ఆకట్టుకుంటోంది. మా నేత మారిపోయారని తెలుగు తమ్ముళ్లు తెగ సంబరపడిపోతున్నారు. లోకేష్ ను చూసేందుకు తిరుపతిలో ఓటర్లు కూడా భారీగా వస్తుండడంతో సగం గెలుపు ఖాయమైంది అంటున్నారు.
మార్పు ఆకారంలో కాదు.. ఆయన శైలిలో కనిపిస్తోంది అంటున్నారు. ఎప్పుడూ కేవలం రోడ్ షోలకు లేదా.. పార్టీ లీడర్లతో సమావేశాలు,బహిరంగ సభలకే పరిమితం అయ్యే లోకేష్.. ఇప్పుడు గల్లి గల్లీలో కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారు. రోడ్డు పక్కన ఉండే షాపుల వారిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. స్వయంగా వెళ్లి వారి కష్టాలపై ఆరా తీస్తున్నారు. ఆప్యాయంగా అందరితో మాట్లాడుతున్నారు అని తెలుగు తమ్ముళ్లు హ్యాపీగా ఫీలవుతున్నారు.
సింపుల్ గా ఇలా సాధారణ ప్రజలతో మమేకమైపోతూ ప్రచారం చేయడమే కాదు.. ప్రత్యర్థి పార్టీలపై మాటల తూటాలు కూడా గట్టిగానే పేలుస్తున్నారు. సాధరణంగా గతంలో లోకేష్ పది నిమిషాలు మాట్లాడితే పది తప్పులు మాట్లాడుతారని విపక్షాలు విమర్శించేవి.. కానీ రెండు రోజుల పాటు తిరుపతిలో ప్రచారంలో పాల్గొన్నఆయన ఎక్కడా తప్పులు దొర్లకుండా తన ప్రసంగాల్లో ధాటిని పెంచారు.
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 22 లోక్ సభ, ఆరు రాజ్యసభ రోబోలను జగన్ ఢిల్లీకి పంపారని, ఈ వైసీపీ రోబోలు ఏపీకి ఏమి చేశారని ప్రశ్నించారు. మోదీ కనపడితే చాలు ఉకోడుతూ ఉంటాయని అన్నారు. కేంద్రం ఏదైనా బిల్లులు తెస్తే.. అందులో ఏం ఉన్నాయో చూడకుండానే తలపుతూ ఉంటాయంటూ తీవ్ర విమర్శలు చేశారు.
ప్రశ్నించే పనబాక లక్ష్మి కావాలా...లేక జగన్ సేవ చేసే రోబో కావాలో తిరుపతి ప్రజలు నిర్ణయించుకోవాలి అంటూ ఓటర్లను కోరారు లోకేష్. టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీలు పార్లమెంటులో సింహాల్లా గర్జిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. పుదుచ్చేరిలో ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారని.. అక్కడ బీజేపీ గెలుపు కోసం వైసీపీ రోబోలు పనిచేస్తాయని ఎద్దేవా చేశారు.
ఏపీలో బంగారం దొరుకుతుంది కానీ ట్రాక్టర్ ఇసుక మాత్రం దొరకదని మండిపడ్డారు. ఏ పందికొక్కులు ఇసుకను తింటున్నాయో అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు దేవుడికి భక్తితో వచ్చి గుండు కొట్టించుకుంటే.. వైకాపా నేతలు మాత్రం దేవుడికే గుండు కొడుతున్నారని లోకేష్ ఆరోపించారు.
ఆఖరికి వైసీపీ నేతలు దేవుడి లడ్డులను కూడా బ్లాక్ లో అమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికలలో ఓట్లు కోసం లడ్డులను పంచిన నీచ సంస్కృతి అధికార పార్టీ నేతలదన్నారు. ఒక చెల్లి న్యాయం కోసం ఢిల్లీ వెళ్తుంటే.. మరో చెల్లిని హైదరాబాద్ లో జగన్ వదిలేశారని.. సొంత చెల్లెళ్ళను చూసుకోలేని వ్యక్తి మనకేం చేస్తాడని ప్రశ్నించారు. ఏదీ ఏమైనా ఇప్పుడు చేస్తున్న తప్పులన్నింటీకీ 2024లో వడ్డీతో సహా చెల్లిస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు లోకేష్.