అమేథీలో రాహుల్ గాంధీ తరపున ప్రచారం చేపట్టారు కాంగ్రెస్ నాయకురాలు, ఆయన సోదరి ప్రియాంక గాంధీ. ఈ సందర్బంగా బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై ప్రియాంక గాంధీ సెటైర్లు వేశారు. స్మృతి ఇరానీ ఇప్పటివరకు 16 సార్లు అమేథీ వచ్చారన్న ప్రియాంక గాంధీ... ఎప్పుడూ 4 గంటలకు మించి స్మృతి అమేథీలో లేరని ఆరోపించారు. అమేథీ అభివృద్ధిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుందని ప్రియాంక గాంధీ ధ్వజమెత్తారు. అమేథీ, రాయ్‌బరేలీలో కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని ఓడించేందుకు బీజేపీ నేతలు గ్రామ పెద్దలకు రూ. 20 వేలు పంచుతున్నారని ప్రియాంక ఆరోపించారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు అమేథీలోని అనేక ప్రాంతాల్లో రాహుల్ తరపున ప్రచారం నిర్వహించారు ప్రియాంక గాంధీ.