Amaravati Padayatra: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు అమరావతి రాజధానిగా (Capital Amaravathi) ఉండాలంటూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రస్తుతం పాదయాత్ర ప్రకాశం జిల్లా (Prakasham District) లో కొనసాగుతున్న సమయంలో పరిస్థితి టెన్షన్ టెన్షన్ గా మారింది. నాగులుప్పలపాడు మండలం చదలవాడ చేరుకున్న పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.
పోలీస్ ల లాఠీఛార్జ్ తో పలువురికి గాయాలయ్యాయి. సంతనూతలపాడుకు చెందిన నాగార్జున అనే రైతుకు చేయి విరిగినట్లు తెలుస్తోంది. రైతుల పాదయాత్రలో పాల్గొనకుండా ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వలయంలో పాదయాత్ర కొనసాగుతోంది. పోలీసు నిర్బంధాలతో రణరంగంగా మారింది. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రజలపై లాఠీలు ఝుళిపించడం, జనం ఎదురుతిరగడంతో ఉద్రిక్తంగా మారింది. ఇన్ని కఠిన ఆంక్షలు, నిర్బంధాల్నీ తోసిరాజని పరిసర గ్రామాల నుంచి వేల మంది తరలివచ్చి యాత్రకు సంఘీభావం తెలిపారు. అడుగడుగునా నీరాజనాలు పట్టారు.
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు నుంచి గురువారం ఉదయం యాత్ర మొదలయ్యేసరికే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వందల సంఖ్యలో బలగాల్ని మోహరించిన పోలీసులు.. అక్కడికి వచ్చే మార్గాలన్నీ దిగ్బంధించారు. చెక్‌పోస్టులు పెట్టి వాహనాల్ని మళ్లించారు. కనిపించిన ప్రతిఒక్కరినీ ఎక్కడికి వెళుతున్నారో అడిగి, పాదయాత్రకు కాదని నమ్మకం కుదిరితేనే పంపించారు. వందల మంది పోలీసులు లాఠీలు పట్టుకుని, పాదయాత్ర ముందు సాగుతూ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేశారు. వాహనాలపై తిరుగుతూ ప్రజల్ని అడ్డుకున్నారు.
పాదయాత్రకు వెళ్లేందుకు వీల్లేదని, ఇళ్లకు తిరిగి వెళ్లి పోవాలని పోలీసులు హుకుం జారీ చేశారు. హెచ్చరికల్ని కాదని ముందుకు వచ్చినవారిని తోసిపారేశారు. వందల మంది పోలీసులు రోప్ పార్టీలతో ఎక్కడికక్కడ దిగ్బంధించినా ప్రజలు ఎదురుతిరిగి రైతుల దగ్గరకు చేరుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఒక్కసారిగా లాఠీలు ఝళిపించారు. లాఠీఛార్జిలో పలువురు గాయపడ్డారు. ఒకరి చెయ్యి విరిగింది. నిబంధనలకు లోబడి శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రకు కొవిడ్ నిబంధనలు, ఎన్నికల కోడ్ పేరుతో కావాలనే ఆంక్షలు సృష్టిస్తున్నారని రైతులు, జాయింట్ కమిటీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాదయాత్రకు వెళ్లకుండా తమను అడ్డుకుంటున్న పోలీసులపై పలుచోట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కొడతారా! కొట్టండి చూద్దాం. మేమేమీ రాజకీయ విమర్శలు చేయడం లేదు. మద్యం, బిర్యానీ పొట్లాలు తీసుకుని రాలేదు. జై అమరావతి అన్న నినాదంతో దేవుడి దర్శనానికి వెళుతున్న రైతుల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది భవిష్యత్తు తరాలకు స్ఫూర్తియాత్ర. దీన్ని అడ్డుకోకండి’ అని ధ్వజమెత్తారు.
ఓవైపు ఆగకుండా వర్షం పడుతున్నా రెయిన్కోట్లు ధరించి, గొడుగులు పట్టుకుని ఉదయం 9.30కి రైతులు పాదయాత్ర ప్రారంభించారు. ఉదయం నుంచే నాగులుప్పలపాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో వందల సంఖ్యలో పోలీసులు మోహరించార. నాగులుప్పలపాడు, కేశినేనివారిపాలెం, చదలవాడ, చీర్వానుప్పలపాడు కూడళ్లకు చేరుకున్న ప్రజల్ని వెనక్కు వెళ్లిపొమ్మని హెచ్చరించారు. చదలవాడ వద్ద తమతో వాగ్వాదానికి దిగిన ప్రజలు, రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. మహిళలు, రైతులు పరుగులు తీశారు. కొందరు కిందపడిపోయారు. లాఠీఛార్జిలో చీర్వానుప్పలపాడుకు చెందిన ఆళ్ల నాగార్జునకు చెయ్యి విరిగింది. ఆయన నొప్పి భరించలేక విలవిల్లాడుతూ కూలబడ్డారు.
పోలీసులు పాదయాత్రను అడ్డుకుని లాఠీలు దెబ్బలు తగిలాయి. పోలీసుల దాష్టీకంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. పోలీసులు అడ్డుగా పట్టుకున్న తాడును తోసుకుని, లాఠీలను తీసుకుని విసిరేసి, ఒక్కసారిగా పరుగులు తీశారు. పాదయాత్రకు ఎదురేగి, రైతులతో కలసి జై అమరావతి అంటూ నినదించారు. లాఠీఛార్జి విషయం తెలుసుకుని సమీప గ్రామాల ప్రజలూ ఉవ్వెత్తున తరలిరావడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత యాత్ర ప్రశాంతంగా జరిగింది. పోలీసులు ఎంతగా రెచ్చగొట్టినా, పాదయాత్ర కొనసాగింది.
అమరావతి రైతుల పాదయాత్రపై లాఠీ ఛార్జ్ ను మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. భయంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులపై లాఠీ ఛార్జ్ చేయించారని చంద్రబాబు ఆరోపించారు. అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజల నుంచి వస్తున్న విశేషమైన స్పందనను చూసి సీఎం జగన్ భయపడుతున్నారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా చేపట్టిన యాత్రకు లక్షలాది మంది ప్రజలు తమ సంఘీభావాన్ని తెలుపుతుంటే ప్రభుత్వం మాత్రం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోందని మండిపడ్డారు.
జనసేన సైతం ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడింది. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న రైతులపై దాడి చేయడం అప్రజాస్వామికం అని ఆ పార్టీ ఖండించింది. కేవలలం జనసేన మాత్రమే కాదు.. రాష్ట్రంలో వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలు రాజధాని రైతుల మహా పాదయాత్రకు మద్దతు ప్రకటించారు. చాలామంది రాజకీయ నేతలు పాదయాత్రలో భాగమవుతున్నారు కూడా..
మరోవైపు అమరావతి పరిరక్షణ పేరుతో నిర్వహిస్తున్న రైతుల మహాపాదయాత్రలో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని ప్రకాశం జిల్లా ఎస్పీ మలికాగర్గ్ చెప్పారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. నాగులుప్పలపాడు మండలం చదలవాడలో గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో మహాపాదయాత్ర బృందానికి వ్యతిరేకదిశలో 250 నుంచి 300 మంది రాజకీయ నాయకులు దూసుకొచ్చారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉన్నా పట్టించుకోకుండా పాదయాత్రకు అనుకూలంగా నినాదాలు చేస్తూ వ్యతిరేక దిశలో వచ్చారని తెలిపారు.
వారిని అడ్డుకోబోయిన పోలీసులపై కర్రలతో దౌర్జన్యం చేస్తూ ముందుకు సాగారని, ఒక పోలీసు అధికారి చేతిలోని మ్యాన్‌పాక్‌ను లాక్కునే ప్రయత్నం చేశారని చెప్పారు. ఈ ఘటనల వీడియోను ప్రదర్శించారు. తమ సిబ్బంది వారిని అదుపుచేసేందుకు యత్నించారే తప్ప ఎక్కడా దురుసుగా ప్రవర్తించలేదని ఎస్పీ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా కూడా ఈ గుంపులో వచ్చినట్లు గుర్తించామన్నారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని చెప్పారు. హైకోర్టు ఉత్తర్వులను అమలుచేయడం బాధ్యతగా భావిస్తూ పాదయాత్ర బృందానికి భద్రత కల్పిస్తున్నామన్నారు. నాలుగు వాహనాలకు, 157 మంది మాత్రమే పాల్గొనేందుకు అనుమతి ఉండగా వందల వాహనాలు వస్తున్నాయని, అనుమతికి మించి 15 రెట్లకుపైగా జనం పోగవుతున్నారని, పరిమితికి మించి మైక్‌లు వినియోగిస్తున్నారని, కోవిడ్ నిబంధనలు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు.
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తుండటంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాదయాత్ర సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు తమశాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా హైకోర్టు ఆదేశాలు, డీజీపీ షరతులకు లోబడి అనుమతి పొందిన 157 మంది మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని సూచించారు. నాగరాజు అనే వ్యక్తి గాయపడినట్లు ప్రచారం జరిగిందని, అతడికి ఎటువంటి గాయాలు లేవని చెప్పారు. భద్రత కల్పించడం కోసమే ట్రాఫిక్‌ను సైతం క్రమబద్ధీకరిస్తున్నామని, పెద్ద ఎత్తున జనం రావడం వల్ల పాదయాత్రలో ఉన్నవారి భద్రతకు ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు.