రాజధాని గ్రామాల రైతులు, ఆడపడుచులు 14 రోజులుగా రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారంటే ప్రజాప్రతినిధులు సిగ్గుపడాలన్న ఆయన.. సీఆర్డీఏ అని ప్రత్యేక చట్టం చేసినా రైతుల జీవితాలు ఈ రోజుకి ఆగమ్యగోచరంగా ఉన్నాయంటే ఇది కచ్చితంగా ప్రజాప్రతినిధులు ప్రజలపై చేసిన దాడే అన్నారు. మంగళవారం రాజధాని గ్రామాలలో పర్యటించారు. 14 రోజులుగా రాజధాని రైతులు చేస్తున్న దీక్షలకు సంఘీభావం ప్రకటించారు.
ప్రాంతీయ విభేదాలు తలెత్తితే దేశ సమగ్రతకు నష్టం. విభజన వల్ల రాజధాని హైదరాబాద్‌ను కోల్పోయామని పవన్ అన్నారు. మళ్లీ అలాంటి నష్టం జరగకూడదనే జనసేన పార్టీ స్థాపించానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆనాడు 33వేల ఎకరాలు సేకరించినప్పుడు భయమేసిందని... రేపు ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటని ఆలోచించిన వాడినని అన్నారు.
కానీ ప్రభుత్వంపై నమ్మకంతో రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని... ఒక నగరాన్ని రాత్రికి రాత్రి నిర్మించలేమని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఒక నగర నిర్మాణం కొన్ని దశాబ్దాలు పడుతుందని.. రాజధాని కోసం 29 గ్రామాల రైతులు తమ బిడ్డల భవిష్యత్ ను పణంగా పెట్టి ప్రభుత్వానికి దాదాపు 33 వేల ఎకరాల భూములు ఇచ్చారని వ్యాఖ్యానించారు. రైతులు ఆ రోజు భూములు ఇచ్చింది వ్యక్తులపై భరోసాతో కాదు ప్రభుత్వంపై భరోసాతో ఇచ్చారని... అలాంటి ప్రభుత్వమే ఇవాళ మాట తప్పడం దారుణమని అన్నారు.
సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా వ్యవహరించడం లేదని... కొన్ని జిల్లాలకు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని పవన్ ఆరోపించారు. అమరావతిపై అంత కక్ష ఎందుకో అర్థం కావడం లేదని అన్నారు. ఈ రోజుకీ రాజధానిని అమరావతిలో కొనసాగిస్తారా..? లేక వైజాగ్ తరలిస్తారా..? లేక కర్నూలులో పెడతారో స్పష్టత ఇవ్వడం లేదని వివరించారు.
జీ.ఎన్. రావు కమిటీ వెనుకబడిన విజయనగరంలో రాజధాని నిర్మించాలని చెబితే.. కమిటీ సూచనలు పట్టించుకోకుండా భూములు అమ్ముకోవడానికి వైసీపీ నాయకులు భీమిలీలో రాజధాని అని చెబుతున్నారని పవన్ అన్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెబుతున్న ప్రభుత్వం 6 నెలలుగా అధికారంలో ఉండి ఏం చేసిందని ప్రశ్నించారు.
నిజంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే నిరూపించి దోషులను శిక్షించాలని... అంతేతప్ప కొద్ది మంది వ్యక్తులపై కోపం ప్రజలపై చూపించి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సబబు కాదని పవన్ అన్నారు. అలాగే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను గుర్తించకపోగా.. కొంతమంది వైసీపీ నాయకులు వారిని పెయిడ్ ఆర్టిస్టులు, మాలిక్ గేదెలు అంటూ తిట్టడం బాధాకరమని పవన్ వ్యాఖ్యానించారు.
అమరావతి నుంచి హైకోర్టును తరలించే అధికారం వైసీపీ ప్రభుత్వానికి లేదని పవన్ అన్నారు. హైకోర్టును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చే అధికారం రాష్ట్రపతి, సుప్రీం కోర్ట్ , పార్లమెంటుకు మాత్రమే ఉందని వివరించారు. అవన్ని పట్టించుకోకుండా సీమ ప్రజలను మభ్యపెట్టడానికి జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో ఏర్పాటు చేస్తామని జగన్ చెబుతున్నారని విమర్శించారు.