P.ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18 బాలయ్య మామను ఇద్దరు అల్లుళ్లు టెన్షన్ పెడుతున్నారా..? టీడీపీ రాజకీయ వర్గాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు అల్లుళ్లు ఒక దానిపైనే మనసు పడ్డారని.. ఆ పంచాయితీ మామ వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. మరి ఇద్దరు అల్లుళ్ల కోరికపై బాలయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. ఏ అల్లుడి కోరికను గౌరవిస్తారు.. ఇంతకీ దేని కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బాలయ్య ఫ్యామిలీ నుంచి ముగ్గురు రాజకీయ బరిలోకి దిగారు. బాలయ్య హిందూపురం నుంచి పోటీ చేస్తే.. పెద్ద అల్లుడు లోకేష్ మంగళగిరి నుంచి, చిన్నళ్లుడు భరత్ విశాఖ ఎంపీగా పోటీ చేశారు. అయితే అప్పటికే లోకేష్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయ బరిలో దిగడం అదే తొలిసారి. ఇక భరత్ కు కూడా అదే తొలి రాజకీయ ఎంట్రీ..
అందుకే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బాలయ్య.. ఎన్టీఆర్ కన్నా లోకేష్, బెటర్ అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. తొలిసారి ఎన్నికల బరిలో దిగి ఇద్దరూ ఓడిపోవడంతో.. రెండోసారి అది రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. గెలుపు కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా గెలుపొందే నియోజకవర్గం కోసం వెతుకుతున్నారు.
ఇప్పటికే లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయన్నది టీడీపీ నేతలు చెబుతున్న మాటే.. పోటీ చేసిన తొలిసారే ఓడిపోవడం ఆయనకు మింగుడు పడడం లేదు. ఇక వరుసగా రెండోసారి కూడా ఓడితే.. పార్టీని నడిపించే బాధ్యతల నుంచి స్వచ్చందంగా తప్పుకోవాల్సి వస్తుంది. పార్టీలో ఎవరూ ఆయన మాట వినే అవకాశం ఉండదని లోకేష్ సన్నిహితులు మదన పడుతున్నారు. అందుకే తొలిసారి జరిగిన పోరపాట్లు రిపీట్ కాకుండా ఆయన ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు.
ముఖ్యంగా తనకు గెలుపు కేక్ వాక్ లా మారే నియోజకవర్గం కోసం జల్లెడ పడుతున్నారని. వచ్చే ఎన్నికల నాటికి తనకు ఓ నమ్మకమైన నియోజకవర్గాన్ని వెతికే పనిని పార్టీలో కీలకమైన కొందరు నేతలకు అప్పగించారని.. తన టీమ్ లో పనిచేసే కొంతమంది ఉద్యోగులు అంటే సోషల్ మీడియా సెల్, ఎన్నారై విభాగం, ట్రస్ట్ భవన్, మీడియా వింగ్ తో ఓ కమిటీ ఏర్పాటుచేశారని. తనకు ఏ నియోజకవర్గం అయితే బాగుంటుందో కనిపెట్టే బాధ్యతను వారికి అప్పచెప్పినట్టు తెలుస్తోంది.
గత ఎన్నికల్లోనే లోకేష్ భీమిలి నుంచి ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అందుకే అవంతి పార్టీ మారాల్సి వచ్చిందని.. తరువాత మారిన పరిణామాల నేపథ్యంలో గంటా నార్త్ నియోజకవర్గాన్ని ఎంచుకోగా.. సబ్బంహరిని అకస్మాత్తుగా బరిలో దించారు. అయినా అవంతి శ్రీనివాస్ ముందు సబ్బం హరి నిలబడలేకపోయారు. అక్కడ నుంచి వైసీపీ తరపున గెలుపొంది అవంతి మంత్రి అయ్యారు.
లోకేష్ తెప్పించుకున్న రిపోర్టుల్లో భీమిలి అయితే గెలిచేందుకు అవకాశం ఉందని.. సాధారణ ఎన్నికల్లో ఓటమి తరువాత సబ్బం హరి.. టీడీపీ కేడర్ పటిష్ట పరిచారని.. ప్రస్తుతం టీడీపీకి అక్కడ అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ఈ సారి కచ్చితంగా భీమిలి నుంచి లోకేష్ పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
ఇక రెండో అల్లుడు శ్రీ భరత్ కూడా విశాఖ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. లోకేష్‌కు తోడల్లుడైన మెతుకుమిల్లి శ్రీ భరత్ గత ఎన్నికల్లోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసిన భరత్ కేవలం 3 వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఓటమి తర్వాత సైలెంట్ అయిన ఆయన మళ్లీ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు.
పార్టీ కార్యకర్తల కష్టసుఖాలు తెలుసుకోవడంతో పాటు పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ యాక్టీవ్ వెనుక మళ్లీ ప్రజాక్షేత్రంలోకి దూకాలన్నదే అసలు ఏజెండా అని టాక్ నడుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో భరత్ మళ్లీ విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని సన్నిహితులు చెబుతున్నారు. ఆయన కన్ను అసెంబ్లీపై పడిందని కేడర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకే భరత్ భీమిలి నియోజకవర్గంపై కాన్సంట్రేషన్ చేస్తున్నారు. భీమిలీ తనకు సరైన ప్లేస్ అని భావిస్తున్నట్టు సమాచారం. గీతం యూనివర్శిటీ విస్తరించి ఉన్న భీమిలి ప్రాంతమైతే స్థానిక ప్రజలు ఆదరిస్తారని.. ప్రస్తుతం అక్కడైతే టీడీపీకి బలమైన కేడర్ ఉందని.. తన గెలుపునకు అదే సరైన ప్లేస్ అని భావిస్తున్నారు.
ఇలా తోడి అల్లుళ్లు ఇద్దరూ ఇప్పుడు భీమిలీపైనే ఫోకస్ చేస్తున్నారు. ఆ నియోజకవర్గం నుంచే పోటీకి ఆసక్తి చూపిస్తుండడంతో బాలయ్య ఎవరికీ ఓటు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే గత ఎన్నికల్లో భరత్ పోటీ చేయడానికి కారణం కూడా లోకేష్ అనే తెలుస్తోంది. నారా బ్రాహ్మణి రికమండేషన్ తో నారా లోకేష్ భరత్ ను రాజకీయ అరంగేట్రం చేశారని.. అందుకే లోకేష్ కు మద్దతుగానే భరత్ ఉంటారని మరో వర్గం అంటోంది. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఎవరూ చెప్పలేరు అన్న మాట వాస్తవం.