దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలతో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ఆయా పార్టీల నేతలు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. సొంత స్థానంలో మరో సారి సత్తా చాటాలని అధికార టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. జిల్లాకు చెందిన మంత్రి హరీష్ రావు ఈ మేరకు పార్టీ శ్రేణులను ముందుండి నడిపిస్తున్నారు. బుధవారం నియోజకవర్గంలోని అప్పనపల్లి గ్రామంలో హరీష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటే కాలిపోయే మోటార్లు, బీజేపీ అంటే బాయిల కాడ మీటర్లు అంటూ విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ అంటే 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు అని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అర్థరాత్రి దొంగ కరెంటు ఇచ్చేవారని విమర్శించారు. ఇప్పుడు నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తున్నామన్నారు. రైతుల మేలు కోసం ట్రాన్స్ఫార్మర్లు బిస్కెట్లు లాగా ఇచ్చామన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత కరెంటు, రైతుకు పెట్టుబడి సహాయం, రైతు భీమా, ఇస్తున్నారా? అని ప్రశ్నించారు.
ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చి బాయిలకాడ మీటర్లు పెట్టి రైతు చేతిలో బిల్లు పెడతా అని అంటున్నారని.. ఈ విషయాన్ని అందరూ ఆలోచించాలన్నారు. కేసీఆర్ వచ్చాక నాలుగు సంవత్సరాల నుంచి నాణ్యమైన కరెంటు ఇస్తున్నామన్నారు. ఎన్నికల అయిపోగానే కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు మళ్ళీ వస్తారా? కనబడతారా ఇక్కడ? అంటూ వంగ్యాస్త్రాలు విసిరారు. మన ఇంట్లో వాళ్లు ఎవరో.. బయటి వాళ్లు ఎవరో ఓటర్లు గమనించాలని సూచించారు.
బీజేపీ తెలంగాణ రాకుండా మోసం చేసిందంటూ హరీష్ సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు పెట్టుబడి కింద ఏడాదికి రూ. 10 వేలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రైతులు అప్పుల పాలై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంటే గత ప్రభుత్వాలు పలకరించలేదన్నారు. ఇప్పుడు రైతు మరణించిన ఐదు రోజుల్లోపే రూ. 5 లక్షలు ఇచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం బాధిత కుటుంబానికి భరోసా కల్పిస్తోందన్నారు.