ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయనే ఉత్కంఠ అన్ని పార్టీల్లోనూ నెలకొంది. జనసేన కింగ్ మేకర్ అవుతారంటూ చాలా మంది అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఇచ్చిన క్లూ జనసేన కార్యకర్తల్లో కొంత నిరుత్సాహానికి గురి చేసింది. జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయాన్ని లగడపాటి పరోక్షంగా చెప్పారు. పవర్ స్టార్.. మెగాస్టార్ తమ్ముడు కాబట్టి.. చిరంజీవి కంటే తక్కువ సీట్లే వస్తాయని లగడపాటి అన్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం ఒంటరిగా పోటీ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 18 సీట్లు సాధించింది. అందులో ఏపీలో 16 సీట్లు వచ్చాయి. తెలంగాణలో రెండు సీట్లు వచ్చాయి. 2009లో ప్రజారాజ్యం పార్టీ కోస్తాలోనే 14 సీట్లు సాధించింది. మరోవైపు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెడతారని లగడపాటి చెప్పారు. పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరంలో రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. లగడపాటి రాజగోపాల్ చెప్పిన లెక్క ప్రకారం జనసేనకు ఒకటి నుంచి 15 సీట్లలోపే వచ్చే అవకాశం ఉంది.