ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనది ఓ భిన్నమైన సిద్ధాంతం. కులమతాలతో సంబంధం రాజకీయాలు చేయడమే తమ లక్ష్యమని.., పాతికేళ్ల భవిష్యత్తు కోసమే తాను రాజకీయాలు చేస్తన్నట్లు పవన్ కల్యాణ్ ఎప్పుడూ ప్రకటిస్తుంటారు. ఐతే ఇప్పుడు జనసేనాని తన రూటు మార్చాడా..? ఫ్యాన్ బేస్ తో పార్టీ నడవదని డిసైడ్ అయ్యాడా..? ఏపీ రాజకీయాలకు కుల సమీకరణ కూడా అవసరమని భావిస్తున్నాడా..? అందుకే బలమైన సామాజిక వర్గాలను మచ్చిక చేసుకునే పనిలో గబ్బర్ సింగ్ ఉన్నాడా..?
పూర్తిగా మెగా ఫ్యాన్ బేస్ మీదే ఆధారపడ్డ జనసేనకు ఓట్లు మాత్రం ఆశించిన స్థాయిలో దక్కడం లేదు. దీంతో పవన్ రూటు మార్చినట్లు తెలుస్తోంది. ఫ్యాన్ పాలిటిక్స్ కాదు.., ఇక క్యాస్ట్ పాలిటిక్స్ కు క్లాప్ కొట్టాలని పవర్ స్టార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సిద్ధాంతాల పేరు చెప్తే సీఎం సీటు అందదని భావించారో ఏమో ఇక తాను కూడా పక్కా ట్రెడిషనల్ పొలిటీషియన్ గా మారాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఏపీలో అత్యధిక జనాభా ఉన్న కులం కాపులే. కాపులు ఎటువైపు ఉంటే ఆ పార్టీదే అధికారం. స్వతహాగా కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ కు వారి ఓట్లు పెద్దగా పడలేదు. గత ఎన్నికల్లో కాపులంతా వైసీపీకి ఓట్లు గుద్దేశారు. ఇందుకు ప్రత్యేక్ష ఉదాహరణ భీమవరం, గాజువాకలో పవన్ ఓటమి. దీనికి కారణం కూడా లేకపోలేదు తాను కుల రాజకీయాలు చేయనని.., కులాలు, మాతాలకు తాను అతీతుడినని పవన్ ప్రకటించడంతో కాపులు పవన్ ను తమవాడిగా భావించలేదనే చర్చలు సాగాయి.
దీంతో ఇప్పుడు పవన్ రూటు మార్చినట్లు తెలుస్తోంది. త్వరలో కాపు సంక్షేమ సేనతో పవన్ కల్యాణ్ భేటీ అవుతానని ప్రకటించడంతో పవన్ కాపులను తనవైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ మీటింగ్ లో కాపు రిజర్వేషన్, కాపుల సమస్యలు, వారి కోసం కేటాయించిన నిధులపై చర్చిస్తామన్నారు. ఈ ఒక్క ప్రకటనతో . కాపులను దగ్గర చేసుకునేందుకే పవన్ ఈ మీటింగ్ పెట్టినట్లు తెలుస్తోంది.