మంత్రి కేటీఆర్ త్వరలోనే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం వరంగల్ పర్యటనకు వచ్చిన కేటీఆర్‌కు ముఖ్యమంత్రి స్థాయిలో ఏర్పాట్లు చేశారనే టాక్ వినిపిస్తోంది. అధికారులు, నేతల హడావుడి చూస్తే.. కేటీఆర్ త్వరలోనే సీఎం అవుతారన్న చర్చకు బలం చేకూర్చినట్లుగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. మంత్రి కేటీఆర్‌కు స్వాగతం పలికేందుకుగాను నిట్ క్యాంప్‌సలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు అధికార పార్టీ నేతలంతా క్యూ కట్టారు. అనంతరం మడికొండ ఐటీ కంపెనీల వద్దకు చేరుకునేందుకు కాన్వాయ్ సిద్ధమవుతుండగా మంత్రి కేటీఆర్ ఒక్కసారిగా డ్రైవర్ సీట్లో కూర్చున్నారు. సైయెంట్ కంపెనీ అధినేత బీవీ మోహన్‌రెడ్డి బెంజ్ కారును కేటీఆర్ తన కాన్వాయ్‌లోని ఇతర వాహనాలతో సమానంగా నడిపించారు. సాధారణంగా మంత్రుల కాన్వాయ్‌లో ప్రత్యేకంగా అంబులెన్స్ ఉండదు. కేటీఆర్‌కు మాత్రం అంబులెన్స్‌తోపాటు రోప్ పార్టీని సైతం ఏర్పాటు చేశారు. మీడియాకు సైతం ఎంట్రీ పాస్‌లను అందజేశారు. అయితే మంత్రి కేటీఆర్ డ్రైవ్ చేస్తున్న కారును ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రైవేటు వాహనంగా భావించి నిలిపివేయడంతో కాన్వాయ్‌లో కొద్దిసేపు కలకలం రేగింది.