పేదలు, రైతులు, నిరుద్యోగ యువకులను ఆకట్టుకునేలా ఐదు ప్రధాన అంశాలతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది.
ఈ కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, పార్టీ సీనియర్ నేతలు చిదంబరం, ఏకే ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు.
మేనిఫెస్టోను ఆవిష్కరించి మాట్లాడిన రాహుల్ గాంధీ... కాంగ్రెస్ మేనిఫెస్టో అనేది దేశ అభివృద్ధికి పెద్ద ముందడుగు అన్నారు. ఏడాది క్రితం ఈ ప్రక్రియను మొదలుపెట్టామన్న ఆయన... ప్రజల ఆకాంక్షలు మేనిఫెస్టోలో ఉండాలని చిదంబరానికి చెప్పినట్లు తెలిపారు.
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కనీస ఆదాయ పథకాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కనీస ఆదాయ పథకం (న్యాయ్) కింద ప్రతీ పేదవాడి బ్యాంక్ అకౌంట్లో రూ.72000 జమ చేయనున్నట్లు రాహుల్ తెలిపారు.
గతంలో హామీ ఇచ్చినట్లుగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీని నెరవేరేస్తామన్నారు రాహుల్ గాంధీ. 2014 ఫిబ్రవరిని మన్మోహన్ ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారన్నారు.
గ్రామ పంచాయతీల్లో పదిలక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ. ఉపాధి హామీ పని దినాల్ని 150 రోజులకు పెంచుతామన్నారు.
రైతులు రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకుంటే జైలుకు తరలిస్తున్నారని రాహుల్ ఆరోపించారు.తాము అధికారంలోకి వస్తే.. రుణాలు చెల్లించని రైతులపై క్రిమినల్ కేసులు పెట్టామన్నారు.
సంపద సృష్టిస్తాం... సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్న నినాదంతోనే కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేశామన్నారు.