ఏపీలో అధికార వైసీపీ త్వరలో ఎన్డీఏ గూటికి చేరుతోందా..? త్వరలో విస్తరించనున్న కేబినెట్ లో ఏపీ నుంచి వైసీపీకి ఒకటి లేదా రెండు కేంద్ర మంత్రి పదవులు లభించనున్నాయా..? మొన్న సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీలో ఈ విషయంపై చర్చ జరిగిందా. సీఎం జగన్ ఎన్డీఏ లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..? ఇందులో నిజమెంత..?
ఇప్పటికే వివిధ రాష్ట్రాల సీఎంలు మమతా బెనర్జీ, స్టాలిన్, కేజ్రీవాల్, కేసీఆర్ ఇంకా ఇతర ముఖ్యమంత్రులు, ప్రాంతీయ పార్టీలు కేంద్రానికి వ్యతిరేక కూటమిగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ప్రాంతీయ పార్టీలు ఏకమైతే కేంద్రంలో ఎన్డీఏకు గట్టి దెబ్బ తగిలినట్టే అవుతోంది. 2022లో ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గుజరాత్ లాంటి కీలక రాష్ట్రాల ఎన్నికలు కూడా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలువస్తే రాజకీయంగా ఇబ్బంది తప్పదు. ఈ నేపథ్యంలో ఎన్డీఏను మరింత బలపరిచే యోచనలో కేంద్ర పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది..?
ఇందులో భాగంగా కొత్త పార్టీలను.. ప్రాంతీయంగా బలంగా ఉన్న పార్టీలను ఎన్డీఏలోకి చేర్చుకోవడమే మంచిదని కేంద్ర పెద్దలు భావిస్తున్నట్టు ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ విషయానికి వస్తే గత ఎన్నికల ముందు వరకు టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉండేంది. కానీ అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రధాని మోదీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశారు..
గత ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత టీడీపీ మళ్లీ ఎన్డీఏకు చేరువ అవుతుందని ఊహాగానాలు వినిపిస్తునే ఉన్నాయి. చంద్రబాబు సైతం ఇప్పటి వరకు ఎక్కడా కేంద్రాన్ని పెద్దగా తిట్టిన సందర్భాలు లేవు. అవసరమైతే మోదీని పొగడ్డమే తప్ప.. అయితే ఏపీ బీజేపీ నేతలు మాత్రం టీడీపీ మళ్లీ ఎన్డీఏలో చేర్చుకోవడం కుదరని తెగేసి చెబుతున్నారు.
ప్రస్తుతం ఏపీలో బీజేపీ -జనసేనతో కలిసి నడుస్తోంది. రెండు పార్టీల మధ్య పరస్పర అవగాహన ఉంది. ఇటీవల తిరుపతి ఉప ఎన్నికలో జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపారు.. అయితే ఈ పొత్తులపై జనసైన్యం అంతా ఆసక్తి చూపించడం లేదు. తిరుపతి ఉప ఎన్నికలో అది స్పష్టంగా కనిపించింది. మరోవైపు పవన్ సైతం బీజేపీ పెద్దల తీరుపై కాస్త అసహనంతోనే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విబేధాలు బయపడ్డాయి.
తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తరువాత పవన్ తో పొత్తు పెద్దగా వర్కౌట్ అయ్యేలా లేదని కేంద్ర పెద్దలకు నివేదిక అందినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కు బై బై చెప్పాలా..? కొనసాగించాలా అన్నదానిపై ఇప్పటికే చర్చ ప్రారంభమైనట్టు సమాచారం. ఒక వేళ పొత్తు కొనసాగితే పవన్ లేదా జనసేన నుంచి ఒకరికి కేంద్ర మంత్రి ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. లేదు పవన్ ను వద్దు అనుకుంటే.. వైసీపీని ఎన్డీఏలో చేర్చుకోవడమే మంచిదని కొందరు నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.
తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా- సీఎం జగన్ ల మధ్య గంటన్నర పాటు చర్చ జరిగింది. ఈ చర్చలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. సీబీఐ కేసులు, రఘురామ రాజు ఇష్యూతో పాటు.. భవిష్యత్తు రాజకీయాలపై చర్చ జరిగినట్టు కూడా తెలుస్తోంది. అవసరమైతే ఎన్డీఏకు అన్ని సందర్భాల్లో మద్దతుగా ఉంటామని జగన్ చెప్పినట్టు సమాచారం.. కానీ బయట నుండి మద్దతు ఇవ్వడం కంటే ఎన్డీఏలో చేరితే మంచిందని ఇద్దరు నేతలు అభిప్రాయానికి వచ్చినట్టు ప్రచారం ఉంది.
ఒకవేళ ఎన్డీఏలో వైసీపీ చేరాలి అని నిర్ణయించుకుంటే త్వరలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో వైసీపీకి ఒకటి లేదా రెండు కేంద్రమంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. అదే జరిగితే రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి లేదా తిరుపతి ఉప ఎన్నికలో ఇటీవల గెలిచిన గురుమూర్తిలో ఒకరికి మంత్రి పదవి వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇలాంటి మెసేజ్ లు వైరల్ గా మారాయి..
వైసీపీ-బీజేపీల పొత్తుపై ఆ రెండు పార్టీల నేతలు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ ఢిల్లీ వర్గాల్లో మాత్రం జోరుగానే ప్రచారం జరుగుతోంది. రాష్ట్నపతి ఎన్నికకు ముందే వైసీపీ ఎన్డీఏ గూటికి చేరుతుందనే ప్రచారం ఉంది. అయితే ఈ ప్రతిపాదన జగన్ ముందు ఉన్నా.. ఎన్డీఏ లో చేరడం మంచిదా..? బయట నుంచి మద్దతు ఇవ్వడం మంచిదా అనే విషయంపై ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది...
గతంలో జగన్ సీఎం అయిన వెంటనే ఏపీకి ఏ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తే ఆ పార్టీకి కేంద్రంలో మద్దతు ఇస్తామని జగన్ చెప్పారు. కానీ ప్రస్తుతం అందుకు బీజేపీ సిద్ధంగా లేదన్నది బహిరంగ రహస్యం.. అలాంటప్పుడు ఎన్డీఏలో చేరితే ఏపీలో వైసీపీ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందులోనే ఏపీలో బీజేపీ పై తీవ్ర వ్యతిరేక భావన ఉంది. ముఖ్యంగా వైసీపీ ఎక్కువ అండగా నిలుస్తున్నవి మైనార్టీ ఓట్లే.. అదే ఎన్డీఏలో భాగస్వామి అయితే వైసీపీకి మైనార్టీ వర్గాలు దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో ఎన్డీఏలోకి చేరడం అంటే కోరి కష్టాలు తెచ్చుకోవడమే అని స్థానిక వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం..