ఆంధ్రప్రదేశ్ పై కమల దళం ఫోకస్ చేసింది.. వచ్చే ఎన్నికల నాటికి బలపడడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇటీవల తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తరువాత ఏపీలో ఒంటరిగా పాగ వేయడం అసాధ్యమని బీజేపీపెద్దలకు స్పష్టత వచ్చిందనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి కీలక నేతల్లో ఒకరిద్దరికి మంత్రి పదవి ఇస్తే పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తోంది. ప్రస్తుతం ఏపీకి చెందిన ఒక్కరు కూడా కేంద్రమంత్రి వర్గంలో లేరు. త్వరలోనే కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ చేపడతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కు కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ప్రధానిగా మోదీ రెండో సారి బాధ్యతలు స్వీకరించిన తరువాత రెండేళ్ల కాలం పూర్తయినా.. ఇప్పటి వరకు మంత్రివర్గంలో మార్పులు-చేర్పులు జరగలేదు. ఇప్పుడు కరోనా సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పట్టడం.. మరో ఆరు నెలల కాలంలోనే అయిదు రాష్ట్రాల ఎన్నికలు ఉండటంతో.. కేబినెట్ లో మార్పులు చేయడం అనివార్యమని ప్రధాన మంత్రి నిర్ణయానికి వచ్చినట్టు బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈ సారి అన్ని రాష్ట్రాలకు కేంద్రం కేబినెట్ లో ప్రాతినిధ్యం ఉండేలా చూసుకోవాలని మోదీ, అమిత్ షాలు లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం. 2019 ఎన్నికల్లో ఎన్డీఏ వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి ప్రాతినిధ్యం లేదు. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బలపడే దిశగా కమలదళం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా తెలంగాణకు మరో మంత్రి పదవి ఇవ్వటంతో పాటుగా ఏపి నుండి ఒకరికి అవకాశం ఇవ్వాలని కమల నాధుల ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఏపీ నుండి బీజేపీకి లోక్ సభ సభ్యులు ఎవరూ లేరు. రాజ్యసభ నుండి జీవీఎల్ నరసింహారావు ఒక్కరే ఉన్నారు. ఆయన ఉత్తరప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏపీ నుండి బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా సురేష ప్రభు ఉన్నారు. జీవీఎల్ పార్టీకి విధేయుడనే పేరు ఉంది. కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయనకు అవకాశం ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. పురంధేశ్వరి వంటి వారి పేర్లు సైతం వినిపిస్తున్నాయి.
ప్రయత్నాలు ముమ్మరం చేసిన టీడీపీ మాజీ నేతలు. టీడీపీ నుండి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి...సీఎం రమేష్.. టీజీ వెంకటేష్ సైతం కేంద్ర మంత్రి పదవి ఆశిస్తున్నారు. వారిలో సుజనా చౌదరి గతంలోనూ మంత్రిగా చేసి ఉన్నారు. సీఎం రమేష్ బీజేపీకి రాజ్యసభలో కొన్ని సందర్భాల్లో కీలకంగా వ్యవహరించారు. ఫ్లోరే మేనేజ్ మెంట్ లో చురుకుగా పని చేసారు. ఇక, టీజీ వెంకటేష్ కు బీజేపీ అధినాయకత్వంలో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. మంత్రి వర్గ విస్తరణ వార్తల నేపథ్యంలో ఇప్పటికే ముగ్గురు నేతలు లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం.
ఆ గ్యాప్ ను ఫిల్ చేయడానికి వపన్ కు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తే బెటరనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకు కేంద్ర మత్రి ఇవ్వటం ద్వారా తెలంగాణలోనూ పవన్ ద్వారా బీజేపీకి ప్రయోజనం ఉంటుందని లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ను ఎదుర్కోవాలంటే జనాకర్షణ కలిగిన నేత అవసరమని..అందుకు పవన్ కు కేంద్ర మంత్రి ఇవ్వటం అవసరమని ఆర్ఎస్ఎస్ లో కీలకంగా వ్యవహరించే ఒక ముఖ్య నేత బీజేపీ అధినాయకత్వం వద్ద ప్రస్తావించినట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అయితే ప్రస్తుతం ఇవన్నీ ప్రచారంలో ఉన్నా.. కసరత్తు పూర్తిగగా కొలిక్కి రాలేదని సమాచారం. మంత్రి వర్గ విస్తరణ అయితే త్వరలోనే ఉంటుందని.. ఏపీకి కచ్చితంగా ఒక మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. ఆ పదవి జనసేనకు ఇస్తే.. వచ్చే ఎన్నికల సమయానికి ఏపీలో పుంజుకొనే అవకాశం ఉంటుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. దీనిపై గతంలోనూ పవన్ కు బీజేపీ పెద్దలు క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం.